ఉత్తమ్ మైండ్ గేమ్ ఆడుతున్నారా?

January 23, 2018


img

 కాంగ్రెస్ మూస విధానాలకు భిన్నంగా ఈసారి ఆ పార్టీ అధిష్టానం టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పూర్తి స్వేచ్చనిచ్చి అండగా నిలబడటంతో అయన మాటలలో ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. అలాగని రెచ్చిపోయి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా పార్టీలో అందరినీ కలుపుకుపోతూ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు సహకరిస్తారో లేదో రానున్న రోజులలో తేలిపోతుంది. 

రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలంలో మంగల్ పల్లికి చెందిన తెదేపా నేతలు, కార్యకర్తలు సోమవారం గాంధీ భవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీసం 70 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని అధికారంలోకి రావడం ఖాయం. దక్షిణ తెలంగాణా జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ ‘క్లీన్ స్వీప్’ చేయబోతోంది. అలాగే రంగారెడ్డి జిల్లాలో మొత్తం 12 సీట్లు కాంగ్రెస్ పార్టీయే గెలుచుకోబోతోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ‘బంగారి తెలంగాణా’ పేరు చెప్పి ఇతర పార్టీలకు చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు, నేతలను తెరాసలోకి ఆకర్షించారు. కానీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర శ్రేయస్సు కోసమే కొంతమంది తెరాస ఎమ్మెల్యేలతో సహా అనేక ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇతర పార్టీలలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి మాపార్టీలో సముచిత ప్రాధాన్యం, గౌరవం ఇస్తాము. ఈసారి సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్ లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక పార్టీలో అందరూ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి మేము చేయవలసినవన్నీ చేస్తున్నాము,” అని అన్నారు.

ఏడాదిన్నర క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయించిన సర్వేలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 50-55 సీట్లు వస్తాయని, కాస్త కష్టపడితే మరో 10 సీట్లు వస్తాయని చెప్పారు. కానీ ఇప్పుడు కనీసం 70 సీట్లు అవలీలగా గెలుచుకోగలమని చెపుతున్నారు. అది అయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగానైనా చూడవచ్చు లేదా కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని గట్టిగా ప్రచారం చేసుకోవడం ద్వారా తెరాసతో సహా ఇతర పార్టీల నేతలు, ఎమ్మెల్యేలను ఆకర్షించడానికేనని భావించవచ్చు.

ఇదివరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా 101, 105,106 సీట్లు గెలుచుకోగలమంటూ సీట్ల లెక్కలు ప్రకటించేవారు. బహుశః ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదేవిధంగా మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లున్నారు. సీట్ల లెక్కలతో బాటు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నామని, 9 నెలల ముందుగానే అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని, ఇతర పార్టీల నేతలకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని చెప్పుకోవడం అన్నీ ఇతరపార్టీల నేతలను ఆకర్షించడానికేనని భావించవచ్చు.      

అయన చెప్పుకొంటున్నట్లు తెరాసతో సహా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తప్పకుండా వలసలు ఉంటాయి. తెరాసలో టికెట్ దొరకదని అనుమానం కలిగినవారు, తెదేపా, భాజపాలలో ఉంటే గెలవలేమనుకొన్నవారు తమ పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకోవడం సహజమే. కానీ ఆ ఫిరాయింపుల ప్రక్రియను ఎంత త్వరగా మొదలైతే అంత కాంగ్రెస్ కు సానుకూల వాతవరణం ఏర్పడుతుందనే ఆలోచనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈవిధంగా మాట్లాడుతున్నారేమో.


Related Post