హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఓ శుభవార్త. ఇటీవల పెంచిన టికెట్ ఛార్జీలను మెట్రో సంస్థ కొంచెం తగ్గించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా మెట్రో ప్రయాణికులకు తెలియజేసింది. ఇటీవల కనిష్ట ఛార్జీని రూ.10 నుంచి 12 కి పెంచగా, గరిష్ట ఛార్జీని రూ.60 నుంచి రూ.75కి పెంచింది. కానీ ప్రజలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 10 శాతం ఛార్జీలు తగ్గించింది. ఈ నెల 24 నుంచి ఈ సవరణ అమలులోకి వస్తుందని హైదరాబాద్ మెట్రో పేర్కొంది.
హైదరాబాద్ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మెట్రో ఆదాయ, వ్యయాలను, నిర్వహణ ఖర్చులు, అప్పులు, వడ్డీలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల కొద్దిగా టికెట్ ఛార్జీలు పెంచాల్సి వచ్చింది.
కానీ మెట్రో ప్రయాణికుల అభ్యంతరాలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని టికెట్ ఛార్జీలు మళ్ళీ తగ్గించాము. హైదరాబాద్ మెట్రో చాలా బాధ్యతాయుతమైన ప్రజా రవాణా సంస్థ. ఎప్పటికీ ప్రజలకు అందుబాటు ధరల్లో సౌకర్యవంతమైన, సమర్ధమైన రవాణా సదుపాయం కల్పించడమే మా ప్రాధాన్యత,” అని అన్నారు.