హైదరాబాద్, కేపీహెచ్‌బీ వద్ద గల మంజీరా మాల్ ఇకపై ‘లులూ మాల్’గా మారబోతోంది. మంజీరా (రీటెయిల్ హోల్డింగ్స్) దివాళా తీయడంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దానిని అమ్మకానికి పెట్టగా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు దానిని దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. చివరికి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న లులూ గ్రూప్ రూ.318.42 కోట్లు చెల్లించేందుకు సిద్దపడి మంజీరా షాపింగ్ మాల్‌ని సొంతం చేసుకుంది. కొంతకాలం క్రితం మంజీరా మాల్‌ని లులూ గ్రూప్ లీజుకి తీసుకొని నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ బదిలీ ప్రక్రియ పూర్తి కాగానే మంజీరా మాల్ యజమానిగా లులూ గ్రూప్ మారుతుంది. ఇకపై లులూ గ్రూప్ తమ సొంత పేరుతో ఈ షాపింగ్ మాల్ నిర్వహిస్తుంది.
గత ప్రభుత్వ హయంలోనే లులూ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులతో సరుకు రవాణా, ఎగుమతుల కేంద్రం, ఫుడ్ ప్రాసెసింగ్, శీతల గోదాములు, షాపింగ్ మాల్ వగైరా ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మంజీరా షాపింగ్ మాల్ సొంతం చేసుకుని మరో అడుగు ముందుకు వేసింది.