చైనాలో పేరుమోసిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ బీవైడీ భారత్‌లో మొట్ట మొదటి ప్లాంట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేయబోతోంది. ఆ కంపెనీ ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులు మూడు ప్రాంతాలను చూపించారు. వాటిలో ఏదో ఓ చోట భారీ పెట్టుబడితో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది బీవైడీ.
తొలిదశలో కార్ల అసెంబ్లీ యూనిట్, 20 గిగావాట్స్ సామర్ధ్యం కలిగిన కార్ల బ్యాటరీల ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయాలని బీవైడీ ప్రణాళికలు సిద్దం చేసుకుంది. రాబోయే 5-7 ఏళ్ళలో ఈ ప్లాంట్ నుంచి ఏడాదికి 6 లక్షల ఎలక్ట్రిక్ కార్లు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కనుక బీవైడీ కంపెనీ రాకతో భారత్‌లో కార్ల కంపెనీలకు గట్టి పోటీ తప్పదు.
ఒకవేళ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ ప్లాంట్ ఏర్పాటైతే, దీనికి అనుబందంగా ఆ కార్ల విడిభాగాలు తయారుచేసే అనేక మద్య, చిన్న పరిశ్రమలు కూడా వస్తాయి. కనుక బీవైడీ, దాని అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాదిమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
ఇటీవల బీవైడీ కంపెనీ కేవలం 5 నుంచి 8 నిమిషాలలో బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేయగల 1 మెగావాట్ ఫ్లాష్ చార్జర్‌ని తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంతవరకు అంత వేగంగా ఎలక్ట్రిక్ కార్లని ఛార్జింగ్ చేసే పరికరం ఎక్కడా లేకపోవడంతో దానిని చూసి ప్రపంచదేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి.