బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు రేపే శంఖుస్థాపన

September 13, 2017
img

భారతదేశంలో మొట్టమొదటి  బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు గురువారమే శంఖుస్థాపన జరుగబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జపాన్ ప్రధానమంత్రి షింజో అబే నిన్న సాయంత్రమే డిల్లీకి చేరుకొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనతో కలిసి బుధవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ వచ్చారు. ముందుగా వారిరువురూ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. తరువాత గాంధీనగర్, అహ్మదాబాద్ లో  పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారత్-జపాన్ దేశాలు 15 ఒప్పందాలు చేసుకోబోతున్నాయి. రేపు ఉదయం వారిరువురూ కలిసి అహ్మదాబాద్ లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేస్తారు. జపాన్ సంస్థలు నిర్మించబోయే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, సాంకేతిక సహకారం ఆ దేశమే అందిస్తోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి ముంబై మద్య ఈ బుల్లెట్ ట్రైన్ నడుస్తుంది. గంటకు సుమారు 250-300 కిమీ వేగంతో నడిచే ఈ రైలు ఆ రెండు నగరాల మద్య గల 508 కిమీ దూరాన్ని కేవలం 3 గంటలలో అధిగమిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.1.10 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. దానిలో సుమారు 81 శాతం పైగా జపాన్ ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఐదేళ్ళలో పూర్తి చేసి 2022 నాటికి బుల్లెట్ ట్రైన్ నడిపించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. 

Related Post