గ‌గ‌న్‌యాన్‌లో వ్యోమ్‌మిత్ర రోబట్‌

January 22, 2020
img

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రెండు భారీ ప్రయోగాలకు సిద్దం అవుతోంది. ఒకటి చంద్రయాన్-3 మరొకటి గ‌గ‌న్‌యాన్‌.   

వాటిలో చంద్రయాన్-3 ప్రయోగం 2021లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషంలో జరిగిన సాంకేతికలోపాలను సవరించి ఈసారి నూటికి నూరుశాతం సాఫ్ట్‌ ల్యాండింగ్ చేసి చూపిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు నమ్మకంగా చెప్పుతున్నారు.  

తొలిసారిగా భారత్‌కు చెందిన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించే ప్రయోగమే గ‌గ‌న్‌యాన్‌. దీనిని మూడు దశలలో చేపట్టబోతున్నట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. ముందుగా డిసెంబర్ 2020, మళ్ళీ జూన్ 2021లో మానవరహిత అంతరిక్షయాత్రలు చేపట్టబోతున్నట్లు శివన్ తెలిపారు. మొదటి దశలో హ్యూమనాయిడ్ (కృత్రిమమేదస్సు కలిగిన రోబోట్)ను పంపించబోతున్నట్లు తెలిపారు. దీనికి ‘వ్యోమ్‌మిత్ర’ అని పేరు పెట్టారు. ఇది వ్యోమగాములు చేసే కొన్ని పనులు చేయగలదు. రెండు బాషలను అర్ధం చేసుకోగలదు. మనుషులతో మాట్లాడగలదు. బుదవారం బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇస్రో శాస్త్ర‌వేత్త శ్యామ్ ద‌యాల్ దీనిని మీడియాకు పరిచయం చేశారు.  

ఈ మొదటి రెండు ప్రయోగాలు విజయవంతమైతే డిసెంబర్ 2021లో మానవసహిత గ‌గ‌న్‌యాన్‌ ప్రయోగం చేస్తామని శివన్ తెలిపారు. దాని కోసం భారత్‌ వాయుసేనకు చెందిన నలుగురు పైలట్లకు ఈ నెలాఖరు నుంచి రష్యాలో శిక్షణ మొదలవుతుందని తెలిపారు. 

అన్నీ అనుకొన్నట్లు సాఫీగా సాగితే డిసెంబర్ 2021లో తొలిసారిగా భారతీయ వ్యోమగాములు అంతరిక్షయాత్రలో పాల్గొంటారు. ఆ ప్రయోగం విజయవంతమైతే తమ తదుపరి లక్ష్యం అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవడమేనని శివన్ తెలిపారు. ఆ తరువాత గ్రహాంతర ప్రయోగాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. 

Related Post