ఇక సైబర్ సెక్యూరిటీపై తెరాస సర్కార్ దృష్టి!

May 21, 2018
img

నోట్ల కొరత పుణ్యామాని దేశంలో నగదు రహితలావాదేవీల సంఖ్య బారీగా పెరిగింది. అలాగే జియో డాటా విప్లవం కారణంగా ఇంటర్నెట్ వాడకం కూడా గణనీయంగా పెరిగింది. వాటితో పాటే సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. సైబర్ నేరగాళ్ళ చేతిలో చిక్కి దేశంలో అనేకమంది ప్రజలు, ప్రముఖులు మోసపోతున్నారు. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. వాటిలో విలువైన డాటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతోంది.  అలాగే ఈ సైబర్ నేరాల కారణంగా దేశంలో కొత్త కొత్త సామాజిక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. కానీ ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సైబర్ నేరాలను ఒక తీవ్రమైన సమస్యగా గుర్తించి వాటి నివారణ కోసం పటిష్టమైన సైబర్ భద్రతావ్యవస్థలు ఏర్పాటు చేయకపోవడంతో ఆ నేరాలు, సామాజిక సమస్యల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. 

తెలంగాణా ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి, సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించింది. దీని కోసం ఏర్పాటు చేసిన హైదరాబాద్ సెక్యూరిటీ ఫౌండేషన్ నెదర్లాండ్ కు చెందిన హేగ్ సెక్యూరిటీ డెల్టా సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకొంది. ఆ రెండూ కలిసి ఈనెల 22న హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ క్లస్టర్ ను ప్రారంభించబోతున్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి, మొబైల్ రంగాల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థల రూపకల్పనకు ఈ హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ క్లస్టర్ కృషి చేస్తుంది. ముఖ్యంగా దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ప్రజలకు మరింత అత్యాధునికమైన సైబర్ సెక్యూరిటీని అభివృద్ధి చేయడానికి ఈ సంస్థలు కలిసి పనిచేస్తాయి. రాష్ట్ర ఐటిమంత్రి కేటిఆర్ ఆలోచన మేరకే ఈ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటుకాబోతోంది. 

Related Post