బుల్లెట్ ట్రైన్ కబుర్లు

April 14, 2018
img

దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు నిర్మించబోతున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లోగా భూసేకరణ పనులు పూర్తిచేసి వెంటనే నిర్మాణపనులు మొదలుపెట్టడానికి ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బుల్లెట్ రైలుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అచల్ ఖరే మీడియాకు తెలియజేశారు. 

గంటకు కనీసం 320 కిమీ వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ రైలు అహ్మదాబాద్-ముంబై నగరాల మద్య గల 508కిమీ దూరాన్ని కేవలం 2-2.30 గంటలలోపే పూర్తిచేయగలదని చెప్పారు. ప్రతీ 20నిమిషాలకు ఒకటి చొప్పున రోజుకు 70 ట్రిప్పులు తిరుగుతాయని చెప్పారు. ఒక్కో బుల్లెట్ రైలులో 10 బొగీలు ఉంటాయని చెప్పారు. అహ్మదాబాద్-ముంబైకు కనీస టికెట్ ధర రూ.3,000 వరకు ఉండవచ్చని చెప్పారు. ఈ బుల్లెట్ రైలులో కనీస టికెట్ ధర రూ.250 ఉండవచ్చని చెప్పారు. ఇవి ప్రస్తుత అంచనాల ప్రకారం చెపుతున్నవేనని చెప్పారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత టికెట్ అసలు ధర ఎంతుంటుందో స్పష్టత వస్తుందని అన్నారు. 

ఇక అహ్మదాబాద్ లో నిర్మించబోతున్న బుల్లెట్ రైల్వే స్టేషన్ పేరు సబర్మతి స్టేషన్ అని ఖరారు చేసినట్లు చెప్పారు. ఇది అహ్మదాబాద్ రైల్వే స్టేషన్, మెట్రో రైల్వే స్టేషన్లకు అతి సమీపంలో ఉంటుంది కనుక, ఆ రెండు స్టేషన్లను కలుపుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తామని చెప్పారు. దీన్ వలన బుల్లెట్ రైలులో నుంచి ఎక్కేవారికి, దిగేవారికి చాలా సౌకర్యంగా ఉంటుందని అన్నారు. 

మహాత్మాగాంధీ చేసిన దిండి సత్యాగ్రహం స్పూర్తిని ప్రదర్శించేవిధంగా ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అత్యంత ఆధునిక వ్యవస్థలు, సౌకర్యాలు కలిగిన సబర్మతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్లు అచల్ ఖరే చెప్పారు. స్టేషన్ పైన రూఫ్ పై సోలార్ ప్యానల్స్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఇక కార్లు, బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా మూడు అంతస్తుల పార్కింగ్ సౌకర్యం కల్పించబోతున్నట్లు చెప్పారు. ఒక్కో అంతస్తులో ఒక్కో రకం వాహనాలను మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. 

సమయపాలనకు మారుపేరైన జపాన్ ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టును నిర్మించబోతోంది కనుక మన దేశం వైపు నుంచి ఎటువంటి అవాంతరాలు, రాజకీయ ఒత్తిళ్ళు లేకపోతే తప్పకుండా 2022 ఆగస్ట్ 15 రోజున నడిపించడం ఖాయమే భావించవచ్చు.

Related Post