నేడు పిఎస్ఎల్వి-సి40 ప్రయోగం

January 12, 2018
img

భారత్ కీర్తిప్రతిష్టలను అంతరిక్షస్థాయికి చేర్చిన ఇస్రో శుక్రవారం మరో ప్రయోగానికి సిద్దం అవుతోంది. ఈరోజు ఉదయం 9.31 గంటలకు పిఎస్ఎల్వి-సి40 ద్వారా 3 స్వదేశీ ఉపగ్రహాలను, 28 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతోంది ఇస్రో. 2018లో ఇస్రో చేస్తున్న మొట్టమొదటి ప్రయోగం ఇది. అలాగే ఈ ప్రయోగం ద్వారా 100వ దేశీయ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలో ప్రవేశపెట్టబోతోంది. ఈరోజు ప్రయోగించబోతున్న మూడు స్వదేశీ ఉపగ్రహాలలో కార్టోశాట్‌-2ఈఆర్‌  చాలా కీలకమైనది. 710 కేజీల బరువు కలిగిన ఈ కార్టోశాట్‌ ఒక నిఘా ఉపగ్రహం. ఇస్రో ఇప్పటికే ఈరకానికి చెందిన 6 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈరోజు 7వ దానిని ప్రయోగించబోతోంది. ఇది 5 ఏళ్ళపాటు సేవలు అందిస్తుంది. సరిహద్దు భూభాగాలు, సముద్ర జలాలు, కార్గిల్ వంటి ఎత్తైన పర్వత సరిహద్దు ప్రాంతాలపై ఇది నిఘా పెడుతుంది. 2016 సెప్టెంబర్ నెలలో భారత ఆర్మీ కమెండోలు పాక్ భూభాగంలోకి చొచ్చుకువెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి ఈ నిఘా ఉపగ్రహాలు అందించిన సమాచారమే చాలా కీలకంగా నిలిచింది. ఈరోజు సాయంత్రం సరిగ్గా 5.18 నిమిషాలకు ఈ నిఘా ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టబడుతుంది. ఆ తరువాత వరుసగా విదేశీ ఉపగ్రహాలు కక్ష్యలో ప్రవేశపెట్టబడతాయి. ఈ మొత్తం ప్రక్రియ అంతా 25 నిమిషాలలోనే ముగుస్తుంది. 

ఇస్రో 2017, ఫిబ్రవరిలో ఒకేసారి 104 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టి, అమెరికా, రష్యా తదితర అగ్రరాజ్యాల సరసన భారత్ ను నిలిపింది. కనుక ఈరోజు 31 ఉపగ్రహాలను ప్రయోగించడం పెద్ద కష్టమైనా పనేమీ కాదనే భావించవచ్చు. 

Related Post