మోడీ కాదంటుంటే కెసిఆర్ ఎలా ఇవ్వగలరు?

December 11, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెరాస సర్కార్ హామీ ఇచ్చింది. కానీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఉన్నందునే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయిన సంగతిని ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో గుర్తు చేసి, ఆ రాష్ట్రంలో పటేల్ కులస్తులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెపుతూ రాహుల్ గాంధీ వారిని కూడా మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

“దేశంలో ముస్లింలతో సహా ఏ కులానికి కూడా రిజర్వేషన్లు పెంచడం ఇక సాధ్యం కాదని, అధనంగా ఇవ్వాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసిల రిజర్వేషన్లలో కోత విదించకతప్పదని, ఆ ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా?” అని ప్రధాని మోడీ ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి అయన సందించిన ఈ ప్రశ్న ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర రాజకీయాలలో పెద్ద చర్చకు తెర తీసింది. ఇక కొత్తగా ఎవరికీ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని సాక్షాత్ ప్రధాని మోడీయే బహిరంగంగా చెపుతున్నప్పుడు, తెరాస సర్కార్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఏవిధంగా భరోసా ఇస్తోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొదట వారు ఈ ప్రశ్నను తమ అధినేత రాహుల్ గాంధీనే అడగాల్సి ఉంటుంది. 

అయితే ఒకవేళ కేంద్రం తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే దీని కోసం సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. అదిలాబాద్ జిల్లాలో నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన ముస్లిం ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను ముస్లింలకు కూడా అందజేస్తున్నామని, రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 

రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం విషయంలో తెరాస సర్కార్ ను వేలెత్తి చూపలేము కానీ ప్రధాని మోడీ రిజర్వేషన్ల గురించి చేసిన తాజా వ్యాఖ్యల నేపధ్యంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే తెరాస సర్కార్ హామీ నమ్మశక్యంగా లేదు. అది తెరాస, భాజపాలకు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. 



Related Post