గుజరాత్ లో నేడు మొదటి దశ పోలింగ్

December 09, 2017


img

కాంగ్రెస్, భాజపాలకు అత్యంత కీలకమైన, చాలా ప్రతిష్టాత్మకంగా మారిన గుజరాత్ శాసనసభ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ ఈరోజు మరికొద్ది సేపటిలో మొదలవబోతోంది. మొదటిదశ పోలింగ్ లో మొత్తం 89 స్థానాలకు 977 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలలో ఎంతమంది పోటీ చేస్తున్నా పోటీ ప్రధానంగా కాంగ్రెస్, భాజపాల మద్యే ఉండబోతోందని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఇవి ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీల మద్య జరుగుతున్న పోటీగా చెప్పవచ్చు. కనుక వారిరువురిలో ఎవరు పైచెయ్యి సాదిస్తారో చూడాలి. 

ఈరోజు జరుగబోయే మొదటిదశ పోలింగ్ లో మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వారిలో పురుషులు 1.11 కోట్లు, మహిళలు 1.01 కోట్ల మంది ఉన్నారు. 

ఈ 2.12 కోట్ల మంది ఓటర్లలో 40 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న ఓటర్లు 1.14 కోట్ల మంది ఉన్నారు. వారిలో 18-25 ఏళ్ళ  మద్య వయసున్న యువకులు 19.81 లక్షల మంది, యువతులు 15.48 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా 26-40 మద్య వయసున్నా వారిలో పురుషులు 41.59 లక్షలు, మహిళలు 37.10 లక్షల మంది ఉన్నారు. అంటే ఈరోజు ఓటు హక్కు వినియోగించుకాబోయే ఓటర్లలో 54 శాతం మంది యువతేనన్న మాట. కనుక వారు మోడీ, రాహుల్ గాంధీలలో ఎవరివైపు మోగ్గు చూపుతారో చూడాలి.  

మోడీ గుజరాతీయుడు కావడం, గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండటం వలన రాష్ట్ర స్థితిగతులపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశం కాగా, రాష్ట్రంలో భాజపా సర్కార్ వైఫల్యాలు, దళితులపై దాడి సంఘటనలు, పటేల్ కులస్థుల మద్దతు లభించడం, జి.ఎస్.టి., నోట్లరద్దు, నగదు రహిత లావాదేవీల కారణంగా నష్టపోయిన గుజరాత్ వ్యాపార వర్గాలలో మోడీ, భాజపాల పట్ల వ్యతిరేకత నెలకొని ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. 

ఈ నెల 14వ తేదీన రెండవ దశ పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 18న ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటించబడతాయి. 


Related Post