ముఖ్యమంత్రికి బిసిలపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా?

December 08, 2017


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల బిసి నేతలతో సమావేశాలు నిర్వహించి వారి సంక్షేమం గురించి మాట్లాడటంపై సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో గురువారం మీడియాతో మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి కెసిఆర్ కు హటాత్తుగా బిసిలు గుర్తుకువచ్చారు. బహుశః ఎన్నికలు దగ్గరపడుతున్నందునే ఇప్పుడు వారి యోగక్షేమాల గురించి మాట్లాడుతున్నట్లున్నారు. బిసిలకు రిజర్వేషన్లు ఇవ్వడం గురించి మాట్లాడేముందు, జనాభా ప్రాతిపదికన తన మంత్రివర్గంలో మరో ఐదుగురు బిసిలకు మంత్రిపదవులు ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకోవచ్చు కదా?"

"కెసిఆర్ మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుంది. ఆయన బిసి సంక్షేమం గురించి మాట్లాడుతారు కానీ తన కుటుంబ సభ్యులకు, తన కులస్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అయన కుమార్తె కవిత ఎంపి అయినప్పటికీ ఒక మంత్రిలాగ వ్యవహరిస్తుంటారు. బిసి డిక్లరేషన్ పేరుతో కెసిఆర్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప వాస్తవానికి అయన ఇస్తున్న హామీలు ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే, 50 శాతం కంటే రిజర్వేషన్లు పెంచడం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా చెపుతున్నారు కదా? అయినా కెసిఆర్ 50 శాతానికి మించి రిజర్వేషన్లను కల్పిస్తామని ఏవిధంగా వారికి భరోసా ఇస్తున్నారు? అది ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లు దండుకోవడానికేనని ఖచ్చితంగా చెప్పగలను. ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే వారు 2019 ఎన్నికలలో తగినవిధంగా ఆయనకు బుద్ధి చెపుతారు," అని అన్నారు వి. హనుమంతరావు. 


Related Post