కులభూషణ్ జాదవ్ పరిస్థితి ఏమిటో?

December 08, 2017


img

కులభూషణ్ జాదవ్ అనే మాజీ నేవీ ఉద్యోగి భారత గూడఛారి సంస్థ ‘రా’ తరపున పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో గూడఛర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో మార్చి 2016లో పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని విచారించిన పాక్ మిలటరీ కోర్టు ఉరి శిక్ష విదించగా భారత ప్రభుత్వం అంతర్జాతీయ నాయస్థానాన్ని ఆశ్రయించి ఉరి శిక్షను నిలిపి వేయించింది. ఒకవేళ అతను తన తప్పు ఒప్పుకొని క్షమాబిక్ష పెటిషణ్ పెట్టుకొన్నట్లయితే పరిశీలించగలమని పాక్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఆవిధంగా చేసినట్లయితే పాక్ ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుంది కనుక అతను అందుకు నిరాకరించారు. కనుక అప్పటి నుంచి అతను పాక్ జైలులోనే మగ్గుతున్నాడు.

అతనితో మాట్లాడేందుకు పాక్ లోని భారత దౌత్యాధికారులను అనుమతించాలన్న భారత్ అభ్యర్ధనను పాక్ ప్రభుత్వం తిరస్కరించింది. అయితే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వ్యక్తిగత హోదాలో పాక్ ప్రధాని విదేశీ వ్యవహరాల సలహాదారు సర్తాజ్ అజీజ్ కు ఒక లేఖ వ్రాశారు. కులభూషణ్ జాదవ్ ను కలిసి మాట్లాడేందుకు అతని తల్లిని, భార్యను అనుమతించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆమె విజ్ఞప్తిని మానవతా దృక్పధంతో మన్నిస్తున్నట్లు తెలిపారు. వారిరువురూ డిసెంబర్ 25వ తేదీన జైల్లో ఉన్న కులభూషణ్ జాదవ్ ను కలుసుకొనేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. వారితో బాటు పాక్ లో భారత ఎంబసీకి చెందిన ఒక దౌత్యాధికారిని కూడా అనుమతించబోతున్నట్లు తాజా సమాచారం. అంతకంటే ముందు ఈనెల 13వ తేదీన అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆ కేసుపై పాక్ తన వాదనలను వినిపించబోతోంది. 

కులభూషణ్ విషయంలో పాక్ వెనక్కు తగ్గినా లేదా ఒత్తిళ్లకు లొంగి అతనిని బేషరతుగా విడిచిపెట్టేసినా అతను గూడఛారి కాదనే భారత్ వాదనలను అంగీకరించినట్లవుతుంది. బహుశః అందుకే విడిచిపెట్టడంలేదని భావించాల్సి ఉంటుంది. కనుక కులభూషణ్ జాదవ్ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో ఊహించడం కష్టమే. 


Related Post