జనవరి నుంచి మిషన్ కాకతీయ పనులు షురూ

December 06, 2017


img

జనవరి 2018 నుంచి మళ్ళీ మిషన్ కాకతీయ 4వ దశ పూడికతీత పనులు ప్రారంభించాలని రాష్ట్ర సాగునీటి శాఖా మంత్రి టి. హరీష్ రావు అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సింగ్ చేసిన మంత్రి హరీష్ రావు, అందుకోసం కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాలు సూచించి వాటిని ఖచ్చితంగా అమలుచేయాలని అధికారులను కోరారు. ఆ వివరాలు: 

1. నాలుగవ దశలో మొత్తం 5,703 చెరువులలో పూడిక తీయాలి.

2. ఆ పనులను ప్రారంభించడానికి అవసరమైన పరిపాలనాపరమైన అనుమతుల కోసం ఈనెల 15వ తేదీలోగా అన్ని జిల్లాలనుంచి దరఖాస్తులు సమర్పించాలి.

3. డిసెంబర్ 31వ తేదీలోగా వాటికి అనుమతులు మంజూరు చేయాలి.

4. జనవరి 15లోగా పూడికతీత పనులను ప్రారంభించాలి.

5. ఆ చెరువులలో పూడిక మట్టి నాణ్యత తెలుసుకొనేందుకు పరీక్షలు చేసి, దానిలో ఇమిడిఉండే పోషక విలువలను స్థానిక గ్రామ పంచాయితీలకు తెలియజేయాలి. ఆ మట్టి లభ్యత, దాని వివరాలను గ్రామ పంచాయితీల వద్ద బోర్డులలో పెట్టి రైతులందరూ పూడిక మట్టిని వినియోగించుకొనేలా చేయాలి.

6. రెండు, మూడు దశలలో పెండింగులో ఉండిపోయిన పనులను ఈ దశలో తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఆ పనులకు బిల్లులను కాంట్రాక్టర్లకు వెంటనే చెల్లించాలి.

7. మిషన్ కాకతీయ 4వ దశ పనులకు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహాయ సహకారాలు తీసుకోవాలి.

8. వ్యవసాయ, నీటి పారుదల శాఖల అధికారులు, దిగువ స్థాయి సిబ్బంది ఈ పనులలో సమన్వయంగా పనిచేయాలి. ఇరుశాఖల అధికారులు అందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ కాకతీయ పనులలో ఎవరు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించబోనని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.  


Related Post