నేటి నుంచి జనంలోకి జనసేనాని

December 06, 2017


img

జనసేనాని పవన్ కళ్యాణ్ నేటి నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావడంతో కొంత కాలం సినిమాలను పక్కనపెట్టి రాజకీయాలపై దృష్టి సారించబోతున్నారు. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు విడతలలో పర్యటించాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. మొట్టమొదట ఏపిలో ఉత్తరాంద్ర జిల్లాలో పర్యటించి సమస్యలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. తరువాత వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం కృషి చేస్తారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రాలో మొదటి విడత పర్యటన పూర్తయిన తరువాత తెలంగాణా జిల్లాలలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. తెలంగాణాలో విద్యార్ధులు, నిరుద్యోగులు, రైతుల సమస్యపై ప్రధానంగా దృష్టిపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

రెండు తెలుగు రాష్ట్రాలలో యువత చాలా నిరాశా నిస్పృహలలో ఉన్నారని వారిని ఉత్తేజపరిచేందుకే ‘చ‌లో రే చ‌లో రే చ‌ల్‌’ గీతం విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తన పర్యటనలో యువతకు ధైర్యం కల్పించడానికి ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. యువత నిరాశా నిస్పృహలకులోనై క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఆవిధంగా చేయడం వలన తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చినవారవుతారని తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వాలు యువతకు లేనిపోని ఆశలు కల్పించినందునే ఈ పరిస్థితి ఏర్పడిందని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో మురళి ఆత్మహత్య తనకు చాలా బాధ కలిగించిందని, పోలీసులు అనుమతించగానే అతని కుటుంబ సభ్యులను కలుస్తానని అన్నారు. యువత  అలాగే ఇటీవల కృష్ణనది పడవ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలను కూడా కలుస్తానని చెప్పారు. మరికొద్ది సేపటిలో పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకొని తన పర్యటన ప్రారంభిస్తారు.   


Related Post