త్వరలో తెలంగాణా శాసనసభ సమావేశాలు?

September 23, 2017


img

తెలంగాణా శాసనసభ సమావేశాలు వచ్చే నెల 10వ తేదీ నుంచి నిర్వహించాలని తెరాస సర్కార్ భావిస్తున్నట్లు తాజా సమాచారం. రాజ్యాంగం ప్రకారం శాసనసభ సమావేశాల మద్య ఆరు నెలలకు మించి గ్యాప్ ఉండకూడదు. అక్టోబర్ 30వ తేదీ నాటికి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసి ఆరు నెలలు పూర్తవుతాయి. కనుక ఆలోగానే అంటే అక్టోబర్ 10వ తేదీ నుంచే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే మంత్రులతో చర్చించి షెడ్యూల్ ఖరారు చేస్తారు.

తెరాస సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణా రైతు సమన్వయ సమితులకు చట్టబద్దత లేకపోవడంతో ప్రతిపక్షాలు వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున, ఈ సమావేశాలలో వాటికి చట్టబద్దత కల్పిస్తూ ఒక బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. వీటి ఏర్పాటుతో తెరాసకు రాజకీయంగా, దాని నేతలు, కార్యకర్తలకు ఆర్ధికంగా లబ్ది కలుగుతుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి కనుక ఈ అంశంపై శాసనసభలో  అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య చాలా వాడివేడిగా వాదోపవాదాలు జరిగే అవకాశాలున్నాయి. 


Related Post