ఏమిటి..దావూద్ భారత్ వస్తున్నడా?

September 22, 2017


img

దావూద్ ఇబ్రహీం...అండర్ వరల్డ్ డాన్..మోస్ట్ వాంటెడ్ క్రిమినల్...ముంబై ప్రేలుళ్ళ సూత్రధారి..ఇంటర్నేషనల్ స్మగ్లర్..ఇలాగ అతని గురించి చెప్పుకొంటూపోతే చాలానే ఉన్నాయి. అతను ప్రపంపంచంలో ఎక్కడ దాకొన్నా పట్టుకొని భారత్ తిరిగి రప్పించవచ్చు కనుక తనవంటి కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే పాకిస్తాన్ లో అనేక ఏళ్ళుగా అతను తలదాచుకొంటున్నాడు. అక్కడ ఉన్నట్లు భారత్ నిఘా వర్గాలు పలుమార్లు దృవీకరించాయి కూడా. కనుక అతనిని భారత్ రప్పించేందుకు మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వింతేమీ కాదు. కానీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ అధినేత రాజ్ థాక్రే ఆ విషయాన్ని తనే ముందు కనుగొన్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. 

అయన ఫేస్ బుక్ లో తమ పార్టీ ఖాతాను ప్రారంభిస్తూ, “దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కనుక అతను అంగవైకల్యం పొందిన వ్యక్తితో సమానం. ఈ పరిస్థితులలో అతను భారత్ తిరిగివచ్చినా శిక్షల నుంచి తప్పించుకొనే అవకాశం ఉంది కనుక వచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఇది గ్రహించిన మోడీ సర్కార్ ఆ క్రెడిట్ తమకే దక్కాలనే ఉద్దేశ్యంతో అతనితో తెర వెనుక చర్చలు జరుపుతోంది. కనుక అతనిని ఏదో విధంగా ఒప్పించి భారత్ రప్పించడం ఖాయంగానే కనిపిస్తోంది. బహుశః వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా అతనిని భారత్ రప్పించి, అది తమ గొప్పదనమేనని ఎన్నికల ప్రచారంలో గొప్పగా టాంటాం చేసుకొని రాజకీయ లబ్ది పొందాలనుకొంటోంది. నేనేదో సరదాగా అంటున్న మాట కాదు ఇది. నూటికి నూరు పాళ్ళు నిజం,” అని మీడియా ప్రతినిధులతో అన్నారు. 

పాకిస్తాన్ లో కూర్చొని భారత్ పై దాడులుచేయిస్తున్న దావూద్ ఇబ్రహీంను మోడీ సర్కార్ ఏదోవిధంగా భారత్ కు రప్పించి చట్టం ముందు నిలబెట్టడానికి కృషి చేస్తుంటే అందుకు అభినందించకపోగా, భాజపా రాజకీయ మైలేజీ పొందాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రయత్నం చేస్తోందని రాజ్ థాక్రే విమర్శలు చేయడం సిగ్గుచేటు. మహారాష్ట్రాలో రాజకీయంగా పైచెయ్యి సాధించేందుకు మరాఠాలను రెచ్చగొడుతున్నవారు మోడీ సర్కార్ పై ఇటువంటి కువిమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. వచ్చే ఎన్నికలలో మహారాష్ట్రలో భాజపా ధాటికి తట్టుకోలేమనే భయంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పవచ్చు.


Related Post