దేనికైనా నేను రెడీ: కోమటిరెడ్డి

September 20, 2017


img

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న మొన్నటి వరకు పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. కానీ నిన్న ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు, “నల్లగొండ లోక్ సభకు ఉపఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేయడానికి నేను రెడీ. వరంగల్లో తెరాస అభ్యర్ధి సాధించిన మెజార్టీ కంటే కాస్త ఎక్కుఅవే సాధించుకోగలను. కానీ ఒకవేళ పార్టీ అధిష్టానం ఉత్తం కుమార్ రెడ్డిని అక్కడి నుంచి పోటీ చేయిస్తే తప్పకుండా నేను ఆయనకు పూర్తి సహకారం అందిస్తాను. ఆయనకే కాదు పార్టీ తరపున ఎవరిని నిలబెట్టినా నేను వారికి సహకరిస్తాను,” అని సమాధానం చెప్పారు. 

అసలు ఉప ఎన్నికల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో ఏముందో ఇంకా తెలియదు కానీ దాని కోసం ప్రతిపక్షాలు ఆశగా ఎదురుచూస్తున్నాయని కోమటిరెడ్డి మాటలతో స్పష్టం అవుతోంది. ఒకవేళ ఉపఎన్నికలు జరిగి వాటిలో కోమటిరెడ్డికి అవకాశం కల్పిస్తే మంచిదే. ఇంతకాలం తన గురించి తను చెప్పుకొంటున్న గొప్పలు నిజమో కాదో తేలిపోతుంది. 

అయితే ఉత్తం కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తానన్న మాటలే చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఆయన్ను తక్షణం ఆ పదవిలో నుంచి దించేయకపోతే పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతానని బెదిరించి, ఇప్పుడు ఆయన పోటీ చేసినా సహకరిస్తానని చెప్పవలసి రావడం రాజకీయాలలో తొందరపాటు పనికిరాదని నిరూపిస్తోంది. 

మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలున్నప్పుడు ఉత్తం కుమార్ రెడ్డి ఎలాగూ పోటీకి ఆసక్తి చూపించకపోవచ్చు కనుక పోటీ చేసినట్లయితే ఆయనకు సహకరిస్తానని కోమటిరెడ్డి అని ఉండవచ్చు. కానీ ఉత్తం కుమార్ రెడ్డి నిజంగా అక్కడి నుంచి పోటీ చేస్తే ఆయనను ఓడించేది కోమటి రెడ్డే తప్ప తెరాస కాకపోవచ్చు. 


Related Post