సమితిలకు మొదటి ఎదురుదెబ్బ

September 12, 2017


img

తెరాస సర్కార్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై ప్రతిపక్షాలు ఎన్ని అభ్యంతరాలు, విమర్శలు చేస్తున్నప్పటికీ ముందుకే సాగుతుండటంతో అవి ముందే హెచ్చరించినట్లుగానే న్యాయపోరాటం ప్రారంభించాయి. తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ మనోహర్ రెడ్డి వాటి ఏర్పాటును, వాటి ద్వారా రైతులకు నిధుల పంపిణీని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. 

జీవో-39 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ రైతు సమన్వయ సమితిలు రెవెన్యూ వ్యవస్థకు ఒక సమాంతరం వ్యవస్థగా రూపొంది చివరకు రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థనే నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని అయన తన పిటిషనులో పేర్కొన్నారు. ఈ సమితులకు మూలధనంగా రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే రూ.500 కోట్లు అధికార తెరాస నేతల జేబులలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కనుక ఈ సమితులకు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

దానిపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకొని, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు సమితులకు ఎటువంటి చెల్లింపులు చేయరాదని తెరాస సర్కార్ ను ఆదేశించింది. రూ.500 కోట్లను రైతు సమన్వయ సమితుల ద్వారా ఏవిధంగా ఖర్చు చేయబోతోందో, అందుకోసం ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు, మార్గదర్శకాలు రూపొందించిందో తెలియజేస్తూ మూడు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 

ఇటువంటి పరిణామం తెరాస సర్కార్ ఊహిస్తున్నదే అయినా ఈ కార్యక్రమంలో ఇది మొదటి ఎదురుదెబ్బ అని చెప్పకతప్పదు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకే ప్రభుత్వంలో పటిష్టమైన రెవెన్యూ యంత్రాంగం ఉన్నప్పటికీ, లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా తెరాస సర్కార్ హడావుడిగా జీవో (నెంబర్:39) జారీ చేసి దానితోనే రైతు సమన్వయ సమితిలకు ఏర్పాటుకు పూనుకొని మొదటి ఎదురుదెబ్బతింది. 


Related Post