భారత ప్రధాన న్యాయమూర్తిగా తరువాత ఎవరంటే..

July 26, 2017


img

ప్రస్తుతం భారత  ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) గా చేస్తున్న జస్టిస్ జెఎస్ ఖేహర్ పదవీ కాలం ఆగస్ట్ 27తో  ముగుస్తుంది. కనుక ఆయన స్థానంలో నూతన సిజెఐ నియామకం కోసం కేంద్రప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. సంప్రదాయం ప్రకారం సిజెఐ పేరు సూచించవలసిందిగా కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాశారు. జస్టిస్ జెఎస్ ఖేహర్ తన తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పేరును సూచించారు. కనుక ఆయనే సిజెఐగా నియమింపబడే అవకాశాలున్నాయని భావించవచ్చు. 

జస్టిస్ దీపక్ మిశ్రా 1977లో ఓడిశా హైకోర్టులో న్యాయవాదిగా తన జీవితం ప్రారంభించి 1996లో అదే హైకోర్టులో అదనపు జడ్జిగా పదోన్నతి పొందారు. ఆ తరువాత ఆయన మధ్యప్రదేశ్, బిహార్, డిల్లీ హైకోర్టులలో ప్రధానన్యాయమూర్తిగా పనిచేశారు. గత 7 సం.లుగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నవారందరిలో ఆయనే సీనియర్ న్యాయమూర్తి కనుక ఆయన పేరును సిజెఐ పదవికి ప్రతిపాదించారు. ఆయన సిజెఐగా భాద్యతలు చేపడితే 14 నెలలపాటు ఆ పదవిలో కొనసాగి పదవీ విరమణ చేస్తారు. గతంలో అంటే 1990-91లో సిజెఐగా చేసిన జస్టిస్ రంగనాథ్ మిశ్రాకు జస్టిస్ దీపక్ మిశ్రా మేనల్లుడు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు దేశంలో అత్యున్నతమైన ఈ పదవిని పొందడం విశేషం. 



Related Post