ఛార్మీ ఎందుకు భయపడుతోందో?

July 24, 2017


img

ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందుకొన్న మన సినీ పరిశ్రమలో వారందరో తమకు డ్రగ్స్ అలవాటు లేదని, డ్రగ్స్ సరఫరా చేసేవారితో ఎటువంటి సంబంధాలు లేవని మీడియాకు చెప్పుకొన్నప్పటికీ, సిట్ విచారణలో వారు చెపుతున్న లేదా చెప్పిన్నట్లుగా వస్తున్న వార్తలు విని జనాలు షాక్ తింటున్నారు. ఈ డ్రగ్స్ కేసులలో ఛార్మీ, ముమ్మైత్ ఖాన్ చెప్పబోయే విషయాలు చాలా ప్రధానమైనవని సిట్ అధికారులు భావిస్తున్నారు. జూలై 26న ఛార్మీ, 27న ముమ్మైత్ ఖాన్ విచారణకు కావలసి ఉంది. 

ఈ డ్రగ్స్ కేసులో నోటీస్ అందుకొన్నప్పుడు ఛార్మీ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. “ఎవరైనా నిన్ను చూసి బాధపడుతున్నారంటే దానర్ధం వారికంటే నీవు పైస్థాయిలో ఉన్నావని,” అని ట్వీట్ చేసింది. ఆమె తండ్రి తన కుమార్తెకు డ్రగ్స్ అలవాటులేదని చెప్పారు. 

ఆమె సోమవారం హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఈ డ్రగ్స్ కేసుల విచారణకు హాజరైనవారి రక్త నమూనాలను, గోళ్ళు, జుత్తును అధికారులు సేకరించడం సరికాదని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది. అసలు విచారణ సరైన (శాస్త్రీయ) పద్దతిలో జరుగడం లేదని పేర్కొంది. ఆమె పిటిషన్ న్ను హైకోర్టు స్వీకరించింది. బహుశః ఈరోజు లేదా రేపు దానిపై తన అభిప్రాయం తెలిపే అవకాశం ఉంది. 

సాధారణంగా మద్యం సేవించి వాహనాలను నడిపించేవారిని గుర్తించడానికి ఒక పరికరాన్ని నోట్లో ఉంచి గాలి ఊదమని పోలీసులు కోరుతారు. అలాగే క్రీడాకారులకు డోపింగ్ టెస్టులు నిర్వహించడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా డ్రగ్స్ సేవిస్తున్నట్లు అనుమానిస్తున్న వారి రక్త నమూనాలను, గోళ్ళు, జుత్తును సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షించి వాటిలో డ్రగ్స్ అవశేషాలు లేదా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా లేదా అనే సంగతి తెలుసుకొంటారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న శాస్త్రీయ పద్దతులు ఇవే. వాటిని ఛార్మీ తప్పు పడుతూ హైకోర్టులో పిటిషన్ వేయడం చూస్తే ఆమె విచారణను ఎదుర్కోవడానికి భయపడుతున్నారనే భావన కలుగుతుంది. ఆమె డ్రగ్స్ వాడకపోయుంటే రక్తం నమూనాలు ఇవ్వడానికి భయపడటం దేనికి? హైకోర్టులో పిటిషన్ వేయడం దేనికి? రేపు విచారణలో సిట్ అధికారులు ఇదే ప్రశ్న అడగకుండా ఉంటారా? 


Related Post