దేశంలోకెల్లా పొడవైన వంతెనను ప్రారంభించిన ప్రధాని మోడీ

May 26, 2017


img

అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజల 6 దశాబ్దాల చిరకాల వాంచను మోడీ సర్కార్ మూడేళ్ళలో నెరవేర్చి చూపింది. ఆ రెండు రాష్ట్రాలను కలుపుతూ బ్రహ్మపుత్రా నదికి ఉపనది లోహిత్ నదిపై నిర్మించిన వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. 9.15 కిమీ పొడవు గల ఈ వంతెన దేశంలోకెల్లా పొడవైనది. ఇది అసోంలో చైనా సరిహద్దుకు సమీపంలో గల తీన్ సుకియా జిల్లాలో మొదలై సాదియా అనే ప్రాంతం మీదుగా సాగి అరుణాచల్ ప్రదేశ్ లోని ధోలా అనే ప్రాంతాన్ని కలుపుతూ నిర్మించబడింది. దీనికి అప్పటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళ క్రితం శంఖుస్థాపన చేసినప్పటికీ యూపిఏ హయాంలో దీని నిర్మాణం ముందుకు సాగలేదు. కానీ మోడీ అధికారంలోకి రాగానే ఈ వంతెనకు రూ.2,056కోట్లు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన కేవలం మూడేళ్ళలో నిర్మింపజేశారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ పదేళ్ళ క్రితమే తాము అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే దీనిని అప్పుడే పూర్తి చేసి ఉండేవారమని అన్నారు. దీని వలన ఆ రెండు రాష్ట్రాల మద్య దూరం 165కిమీ ప్రయాణ సమయం 5గంటలు తగ్గుతుంది. దీనివలన రోజుకు సుమారు పది లక్షల లీటర్ల ఇంధనం కూడా ఆదా అవుతుందని అంచనా వేశారు. మూడు లేన్లతో చాలా విశాలంగా, మిలటరీ ట్యాంకర్లు సైతం ప్రయాణించగల దృడంగా ఈ వంతెనను నిర్మించబడింది.

అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు రెండూ చైనా సరిహద్దును ఆనుకొని ఉన్నాయి కనుక అత్యవసర పరిస్థితులలో అక్కడికి సైన్యాన్ని, యుద్ద పరికరాలను చేరవేయడానికి కూడా ఈ వంతెన ఉపయోగపడుతుంది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో రెండు రాష్ట్రాల మద్య సరుకు రవాణాకు చాలా సౌకర్యం ఏర్పడింది.   



Related Post