అమిత్ షా సూచనతోనే సిఎం మార్పు: జగ్గారెడ్డి

January 22, 2021


img

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర రాజకీయాలపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కలిసి వచ్చిన తరువాత ఆయనలో చాలా మార్పు కనిపిస్తోంది. వారి సూచన మేరకే తాను తప్పుకొని కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్దపడుతున్నారని భావిస్తున్నాను. కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో టిఆర్ఎస్‌-బిజెపి రాజకీయాలు మరోవిధంగా ఉండవచ్చునని భావిస్తున్నాను. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బ తీసేందుకే టిఆర్ఎస్‌-బిజెపి-మజ్లీస్‌ పార్టీలు కలిసి రాజకీయ చదరంగం ఆడుతున్నాయి. పగలు కుస్తీ…రాత్రి దోస్తీ అన్నట్లు...అన్నదమ్ముల పిల్లలు పగలు కొట్లాడుకొంటూ ఊరందరినీ హైరానా చేసి రాత్రి కల్లు దుకాణంలో కలిసి కల్లు తాగినట్లుంది ఆ మూడు పార్టీల పంచాయతీ! ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు మూడు పార్టీలు శత్రువుల్లా పరస్పరం కత్తులు దూసుకొంటాయి. ఎన్నికలైపోగానే మళ్ళీ దోస్తులైపోతాయి. 

ఎన్నికలప్పుడు బిజెపి ఏదో ఓ దేవుడిని పట్టుకువచ్చి మత రాజకీయాలు చేస్తుంటుంది. గ్రేటర్ ఎన్నికలలో బండి సంజయ్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయడమే అందుకు తాజా నిదర్శనం. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలొచ్చినా టిఆర్ఎస్‌ తెలంగాణ సెంటిమెంట్ రాజేసి లబ్దిపొందాలని ప్రయత్నిస్తుంటుంది. బిజెపి హిందూ ఓటుబ్యాంక్ రాజకీయాలు చేస్తే, బిజెపిని బూచిగా చూపించి మజ్లీస్‌ పార్టీ ముస్లింలను రెచ్చగొట్టి ఎన్నికలలో లబ్ది పొందుతుంటుంది. ఈవిధంగా మూడు పార్టీలు కలిసి ప్రతీ ఎన్నికలలో మూడు ముక్కలాటలు ఆడుతూ కాంగ్రెస్ పార్టీని అడ్డుకొంటున్నాయి. 

అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్న నిలబడి వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉంటుంది. ఢిల్లీలో రైతుల ఆందోళనలకు మద్దతుగా రాష్ట్రంలో బంద్‌ చేయించిన కేసీఆర్‌, మూడు రోజులు ఢిల్లీలో ఉన్నప్పుడు వారిని పలకరించలేదు. కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా రైతులవద్దకు వెళ్ళి వారి ఆందోళనలకు మద్దతు పలికారు.    

సిఎం కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నారని, త్వరలో జైలుకు వెళ్ళక తప్పదంటూ బండి సంజయ్‌ పదేపదే చెపుతుంటే వినీవినీ విసుగొస్తోంది. ఇంకా ఎంతకాలం ఆయన ఈ కధలు చెప్తాడు? కేసీఆర్‌ను జైల్లో పెట్టిస్తానని అంటుంటే టిఆర్ఎస్‌ నేతలు ఎందుకు స్పందించడం లేదు? ఆ రెండుపార్టీల మద్య రహస్య అవగాహన ఉన్నందునే ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయా?ఆ మూడు పార్టీల నాటకాలను ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో వాటికి తప్పకుండా బుద్ది చెపుతారని భావిస్తున్నాను,” అని అన్నారు.


Related Post