సుప్రీంకోర్టును నమ్మం..ఆందోళనలు కొనసాగిస్తాం: రైతు సంఘాలు

January 13, 2021


img

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులు సుప్రీంకోర్టు మంగళవారం చేసిన ప్రకటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. రైతుసంఘాల ప్రతినిధి బల్‌బీర్‌ సింగ్‌ నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “రైతు వ్యతిరేక వ్యవసాయచట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ చట్టం రద్దు చేయకుండా కమిటీల పేరుతో ఇంతకాలం కాలక్షేపం చేసిన కేంద్రప్రభుత్వం, ఇప్పుడు సుప్రీంకోర్టును అడ్డుపెట్టుకొని మళ్ళీ అదే పని చేయడానికి సిద్దపడిందని భావిస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రకటించిన కమిటీలో అందరూ కేంద్రప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులే సభ్యులుగా ఉండటమే అందుకు నిదర్శనం. కనుక కమిటీని మేము నమ్మబోము....దానిలో మేము చేరబోము. కేంద్రప్రభుత్వం వ్యవసాయ చట్టాలను బేషరతుగా రద్దు చేసేవరకు మా ఆందోళనలు కొనసాగిస్తాం,” అని ప్రకటించారు. 

ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యంతో సమస్య పరిష్కారమవుతుందనుకొంటే, రైతులు మొండికేయడంతో కేంద్రప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తోంది. గణతంత్ర దినోత్సవానికి ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. ఆనవాయితీ ప్రకారం జనవరి 26న ఏటా ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. పరేడ్ జరుగబోయే రాజ్‌పథ్‌లోనే ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. కనుక వేలాదిమంది రైతులను అడ్డుకొని గణతంత్ర దినోత్సవ వేడుకలను సజావుగా నడిపించడం చాలా కష్టమే. 


Related Post