ప్రధానిని ఆహ్వానించడానికి కేసీఆర్‌ రానక్కరలేదు!

November 28, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ్ళ మధ్యాహ్నం హైదరాబాద్‌ రానున్నారు. భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్ పనితీరు, ఉత్పత్తి, పంపిణీల గురించి స్వయంగా తెలుసుకొనేందుకు హైదరాబాద్‌ వస్తున్నారు. ప్రధాని ఏ పనిపై హైదరాబాద్‌ వస్తున్నప్పటికీ ఆయనకు గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర డిజిపి తదితరులు విమానాశ్రయం వద్ద స్వాగతం పలకడం ఆనవాయితీ. ఇవాళ్ళ ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ వస్తున్నట్లు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) నుంచి సమాచారం అందగానే, ఆయనకు గవర్నర్‌, ముఖ్యమంత్రి తదితరులు స్వాగతం పలుకుతారని సిఎం కార్యాలయం (సీఎంఓ) తెలియజేసింది. కానీ ప్రధాని మోడీ వ్యక్తిగత సహాయకుడు వివేక్ తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌కు ఫోన్‌ చేసి గవర్నర్‌, సిఎం కేసీఆర్‌ విమానాశ్రయానికి రానవసరంలేదని తెలిపారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, సీఎస్ తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సిపి సజ్జనార్, హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్ వస్తే సరిపోతుందని చెప్పారు. అయితే గవర్నర్‌, ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం పలికేందుకు ఎందుకు రావద్దన్నారో వివేక్ తెలుపలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్‌ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈవిధంగా జరుగడం ఇదే మొదటిసారని సీఎంఓ అధికారులు అన్నట్లు తెలుస్తోంది. 

దీనిపై ఓ తెలంగాణ పత్రిక ఇది తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానించడమేనంటూ ఓ కధనం ప్రచురించింది కూడా. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం నగరంలో ఫార్మా కంపెనీలకు భూములు, రాయితీలు ఇచ్చి ప్రోత్సహించినందునే నేడు భారత్‌తో సహా యావత్ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ అందించగలుగుతున్నామని కానీ ప్రధాని నరేంద్రమోడీ ఆకస్మిక పర్యటనతో ఆ క్రెడిట్  అంతా కేంద్రానిదేనని, దాంతో తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదన్నట్లు చూపించి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపికి లబ్ది కలిగించేందుకే నేడు ఈ పర్యటన పెట్టుకొన్నారని ఆ పత్రిక అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆయన ప్రధాని హోదాలో వస్తున్నారా లేక బిజెపి నాయకుడి హోదాలో వస్తున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేసింది. 

     



Related Post