రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ‌

November 27, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపధ్యంలో అన్ని ప్రధానపార్టీల అగ్రనేతలు నిత్యం మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్నారు. కాంగ్రెస్‌ ఫైర్ బ్రాండ్ ఎంపీ రేవంత్‌ రెడ్డి కూడా వరుసగా ఇంటర్వ్యూలిస్తున్నారు. నిన్న ఓ ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు: 

ప్రశ్న: హైదరాబాద్‌ నగరాన్ని టిఆర్ఎస్‌ ప్రభుత్వం రూ.67,000 కోట్లతో అభివృద్ధి చేసిందని చెపుతోంది కదా?

జవాబు: రూ. 67,000 కోట్లతో అమరావతి కంటే పెద్దది...కొత్త రాజధానే కట్టొచ్చు. ప్రభుత్వం నిజంగా అంత డబ్బు ఖర్చు చేస్తే మొన్న వరదలలో నగరమంతా ఎందుకు మునిగిపోయింది? దాని వలన హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. దానికి సిఎం కేసీఆర్‌, కేటీఆఆరే బాధ్యులు కాదా? 

ప్రశ్న: జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పార్టీల ప్రచారంపై మీ అభిప్రాయం ఏమిటి?  

జవాబు: ఈ ఎన్నికలలో స్థానిక సమస్యలు, ప్రజాసమస్యలపై అన్ని పార్టీలు తమ వాదనలు వినిపించి ఓట్లు అడగాలి. కానీ బిజెపి, మజ్లీస్‌ పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. మజ్లీస్‌ను అడ్డంపెట్టుకొని టిఆర్ఎస్‌, బిజెపిలు ఈ ఎన్నికలలో లబ్ది పొందాలని చూస్తున్నాయి. నిజానికి ఆ మూడుపార్టీల మద్య ‘ట్రయాంగిల్ లవ్ స్టోరీ’ నడుస్తోంది.  సెక్యులర్ పార్టీ అయిన మా కాంగ్రెస్ ఇటువంటి విపరీత పోకడలకు ఎప్పుడూ దూరంగా ఉంటుంది. మా ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తే ఆ విషయం అర్ధమవుతుంది. ప్రజలకు కూడా మా ఈ  సెక్యులర్ విధానం గురించి బాగా తెలుసు. కనుక ఈ ఎన్నికలలో మా పార్టీనే గెలిపిస్తారని నమ్ముతున్నాము.       

ప్రశ్న: దుబ్బాక ఉపఎన్నికలలో మీ పార్టీ ఎందుకు వెనుకబడిపోయింది? 

జవాబు: దుబ్బాక ఉపఎన్నికలలో మా పార్టీ అభ్యర్ధిని ఎంపిక చేయడంలో ఆలస్యమైంది. కానీ టిఆర్ఎస్‌, బిజెపిలు రెండు నెలల ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేయడంతో వారికి ఆ ప్రయోజనం లభించింది. 

ప్రశ్న: దుబ్బాక ఎన్నికల ప్రభావం జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఉంటుందా? అవే ఫలితాలు పునరావృతం అవుతాయా?

జవాబు: ఖచ్చితంగా లేదు. దుబ్బాక ప్రభావం తాత్కాలికమే. ఎందుకంటే ఒక ఎన్నికల ప్రభావం మరో ఎన్నికలపై పెద్దగా ఉండబోదని లోక్‌సభ, హుజూర్‌నగర్‌ వంటి ఎన్నికల ఫలితాలను చూస్తే అర్దమవుతుంది. కనుక దుబ్బాక ఫలితాలు జీహెచ్‌ఎంసీలో పునరావృతం అయ్యే అవకాశమే లేదు. 

ప్రశ్న: కాంగ్రెస్‌ నుంచి బిజెపిలోకి ఫిరాయింపులు మొదలయినందున ప్రజలకు మీ పార్టీపై నమ్మకం ఉంటుందా?

జవాబు: నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అందరూ అభివృద్ధి గురించి ఆలోచిస్తే సిఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఫిరాయింపుల రాజ్యంగా తయారుచేశారు. అయితే కత్తి పట్టినవాడు ఏదో ఓ రోజు ఆ కత్తికే బలవుతాడన్నట్లు, ఇప్పుడు ఆ ఫిరాయింపులకు ఆయనే (టిఆర్ఎస్‌) బలవుతున్నారు. ఇక బిజెపిలో చేరడం అంటే ఒక్క రోజు పండుగ వంటిది. ఢిల్లీ వెళ్ళి ఇదివరకు అమిత్ షాతో ఇప్పుడు జేపీ నడ్డాతో ఫోటోలు దిగడానికి మాత్రమే పనికివస్తుంది. ఆ తరువాత మరిక నోరువిప్పి మాట్లాడేందుకు వారెవరికీ అధికారం కూడా ఉండదు. బిజెపిలోకివెళ్లిన నాగం, విద్యాసాగర్ రావు, జితేందర్ రెడ్డి, డికె.అరుణ అందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని, సిఎం కేసీఆర్‌ను వారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత భావప్రకటన స్వేచ్చ, ప్రజాస్వామ్యం మరే పార్టీలోను లేదని వాటిలోకి వెళ్ళినవారే చెప్పుకొంటుంటారు. ఇవన్నీ తెలిసీ కూడా ఏదో ఊహించుకొని బిజెపిలోకి వెళ్ళేవారిని ఎవరూ ఆపలేరు. కానీ గత ఆరున్నరేళ్లలో ఎంతమంది నాయకులు వెళ్ళిపోయినా కాంగ్రెస్‌ పార్టీ స్థిరంగా, బలంగా నిలిచి ఉందని అందరికీ తెలుసు. ఇకపై కూడా ఇలాగే నిలిచి ఉంటుంది. 

ప్రశ్న: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సందర్భంగా కాంగ్రెస్‌ తరపున ప్రజలకు ఏమి చెప్తారు? 

జవాబు: ఇవి మేయర్‌ను నిర్ణయించే ఎన్నికలు. దీనిలో ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్‌ వచ్చి చేయవలసిందేమీ లేదు. కానీ బిజెపి, టిఆర్ఎస్‌ పార్టీ నేతలు హైదరాబాద్‌పై మిడతలదండ్లలా వచ్చివాలి ముప్పేటదాడి చేస్తున్నారు. రేపు ఎన్నికలైపోగానే మళ్ళీ అందరూ ఎగిరిపోతారు. చివరికి మిగిలేది స్థానికంగా ఉండే మావంటివారే. కనుక ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయితీగా పనిచేసే కాంగ్రెస్‌ అభ్యర్ధులకే ఓట్లు వేసి గెలిపించాలని హైదరాబాద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.


Related Post