టిఆర్ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ముఖ్యాంశాలు

November 23, 2020


img

సిఎం కేసీఆర్‌ ఇవాళ్ళ తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. దానిలో ముఖ్యాంశాలు: 

• వచ్చే నెల (డిసెంబర్‌) నుంచి జీహెచ్‌ఎంసీ పరిదిలో ఉన్న అన్ని ఇళ్లకు నెలకు 20,000 లీటర్ల వరకు నీళ్ళు ఉచితం. ఆ పరిమితోలో నీటిని వాడుకొంటున్నట్లయితే ఎటువంటి బిల్లు చెల్లించనవసరం లేదు. 

• రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్షౌరశాలలు (సెలూన్లు)కు డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తాం.

• లాండ్రీలకు, దోబీ ఘాట్లకు కూడా డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తాం.

• లాక్‌డౌన్‌ సమయం (మార్చి నుంచి సెప్టెంబర్ వరకు)లో వాహనాలు తిరుగలేదు. కనుక వాటికి ఆదాయం లేకుండా పోయింది. కనుక ఆ ఏడు నెలలకు రూ.267 కోట్లు మోటారు పన్నును రద్దు చేస్తున్నాం. దీని వలన రాష్ట్రంలో 3,37,611 వాహన యజమానులకు ఊరట లభిస్తుంది.

• లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరిశ్రమలు, వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. వాటన్నిటికీ(హెచ్‌టీ మరియు ఎల్టీ కనెక్షన్లపై) మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కనీస డిమాండ్ ఛార్జీ (మినిమమ్ డిమాండ్ ఛార్జ్)లను రద్దు చేస్తాం.   

• రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లకు కూడా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కనీస డిమాండ్ ఛార్జీ (మినిమమ్ డిమాండ్ ఛార్జ్)లను రద్దు చేస్తాం.   

• రూ.10 కోట్లు లోపు బడ్జెట్‌తో నిర్మించే చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ నుంచి రీయింబర్స్‌మెంట్‌ ఇస్తాం. 

• రాష్ట్రవ్యాప్తంగా అన్ని ధియేటర్లలో అదనపు షోలు వేసుకొనేందుకు, టికెట్ ధరలు పెంచుకొనేందుకు అనుమతిస్తాం. 

హైదరాబాద్‌ నగరంలో మరో 50 ఏళ్ళలో పెరగబోయే జనాభాను దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు అందించేందుకుగాను కేశవాపురంలో భారీ రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. రూ.12,000 కోట్లు వ్యయంతో హైదరాబాద్‌ నగరంలో వరదనీరు పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. రూ.13,000 కోట్లు వ్యయంతో మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. మూసీనదిని గోదావరి నీటితో అనుసంధానం చేసి మొసీని సమూలంగా ప్రక్షాళన చేసి, ఆ ప్రాంతాన్ని పర్యాటక ఆకర్షకేంద్రంగా మలుస్తాం. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. 

హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు, బీహెచ్ఈఎల్ నుంచి మోహిదీపట్నం వరకు పొడిగిస్తాం. హైదరాబాద్‌లో వివిద ప్రాంతాల నుంచి నేరుగా విమానాశ్రయం చేరుకోవడానికి ప్రత్యేకంగా ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌-మెట్రో మెట్రో రైల్‌లో ప్రాజెక్టును త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ మెట్రో రైళ్లు మద్యలో ఎక్కడా ఆగకుండా నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొంటాయి. నగరంలో ఎంఎంటీఎస్ రైళ్ళను మరో 90 కిమీ విస్తరిస్తాం. రూ.22,000 కోట్లు వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటిదశలో భాగంగా నగరంలో అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, ఎక్స్‌ప్రెస్‌ రోడ్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యలను కొంతవరకు పరిష్కరించాం. త్వరలో రెండు, మూడో దశ పనులను చేపడతాం.


Related Post