వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్‌పై సందిగ్ధం

November 23, 2020


img

తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం, ధరణీ పోర్టల్‌ ప్రవేశపెట్టేందుకు వీలుగా రాష్ట్రంలో సుమారు రెండు నెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్‌ నిలిపివేసింది. ఇప్పుడు ధరణీ పోర్టల్‌ కూడా అందుబాటులోకి వచ్చినందున నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్‌ మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 

కానీ ధరణీ పోర్టల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలవడంతో నేటి నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. ధరణీపై దాఖలైన పిటిషన్లపై ఈనెల 3వ తేదీన హైకోర్టు విచారణ జరిపినప్పుడు ధరణీలో వ్యవసాయేతర ఆస్తులను నమోదు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త రెవెన్యూ చట్టం సాగుభూములకు సంబందించినది మాత్రమే కనుక ధరణీలో వాటి నమోదు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొత్త రెవెన్యూ చట్టంలో ధరణీ ప్రస్తావన లేదు కనుక దాని కోసం వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించడం, వాటిని ధరణీలో భద్రపరచడం సరికాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ధరణీ డేటా నిర్వహణ బాధ్యతను ‘థర్డ్ పార్టీ’కి అప్పగించవద్దని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ధరణీలో డేటా భద్రత, నిర్వహణ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు వగైరా పూర్తి సమాచారంతో రెండు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకూ ధరణీలో వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేయవద్దని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదావేసింది. 

ఈ కేసుపై నేడు కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉన్నందున ఈనెల 25 నుంచి వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్స్ మొదలుపెట్టేందుకు సిద్దంగా ఉండాలని సిఎం కేసీఆర్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఒకవేళ హైకోర్టు ధరణీలో వ్యవసాయేత ఆస్తుల నమోదుపై స్టే పొడిగిస్తే వాటి రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ఇంకా ఆలస్యం కావచ్చు.


Related Post