ఈ ఏడాదిలో కరోనా టీకా రానట్లే

October 24, 2020


img

దేశంలో 5-6 కంపెనీలు తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ వేర్వేరు దశలలో ఉన్నాయి. వాటిలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయాలనుకొంటున్న కోవిషీల్డ్’, భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్ టీకాలు మాత్రమే 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌కు చేరుకొన్నాయి. నవంబర్‌ నుంచి 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించడానికి డీసీజీఐ భారత్‌ బయోటెక్ కంపెనీని అనుమతించింది. దాంతో దేశవ్యాప్తంగా 25 కేంద్రాలలో 26,000 మందిపై క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించేందుకు భారత్‌ బయోటెక్ కంపెనీ సిద్దమవుతోంది. ఈ క్లినికల్ ట్రయల్స్‌ వచ్చే ఏడాది మే నాటికి పూర్తవుతాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అవి సఫలమైతే జూన్‌ నుంచి కోవాక్సిన్ ఉత్పత్తి మొదలుపెట్టి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తామని తెలిపారు. ఏడాదికి 11 నుంచి 15 కోట్లు డోసులు ఉత్పత్తి చేయగలమని భారత్‌ బయోటెక్ సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం.

పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియాకు ఏడాదికి 100 కోట్ల డోసూల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉంది. కనుక ఒకవేళ అది చేస్తున్న క్లినికల్ ట్రయల్స్‌ విజయవంతమైతే ఆ సంస్థ కూడా భారత్‌కు అవసరమైనన్ని వ్యాక్సిన్లను అందజేయగలుగుతుంది. ఈ రెండూ కాక దేశీయంగా జైడిల్లా తదితర కంపెనీలు కూడా సమర్ధమైన వ్యాక్సిన్‌ను తయారుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అవి తయారుచేయగలిగితే మంచిదే లేకుంటే లేకుంటే దేశంలో 136 కోట్ల జనాభాకు సరిపడా కరోనా వ్యాక్సిన్‌లను అందజేసేందుకు మళ్ళీ చైనా, రష్యా లేదా మరో దేశం తయారుచేసే వాక్సిన్లను కూడా దిగుమతి చేసుకోక తప్పకపోవచ్చు.

నిజానికి ఈ ఏడాది చివరిలోగా భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితిని చూస్తే వచ్చే ఏడాది మే-జూన్‌ నెలల వరకు ఎదురుచూడక తప్పేలా లేదు. ఒకవేళ వ్యాక్సిన్‌ రావడంలో అంత ఆలస్యం జరిగినట్లయితే దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.


Related Post