మంత్రి కనుసన్నలలో పోలీసులు: రఘునందన్ రావు

October 21, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ కార్యకర్తల వాహనాలను తనికీల పేరిట ఎక్కడికక్కడ నిలిపివేస్తూ, వారి వద్ద నుంచి బలవంతంగా ఫోన్లు లాక్కొని వాటిలో సమాచారాన్ని తమ పరికరాలలోకి బదలాయించుకొంటున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. తనికీల పేరుతో తమ వాహనాలను నిలిపివేసి, తనికీలు చేయకుండా పక్కనపెట్టేస్తున్నారని ఆరోపించారు. తద్వారా కీలకమైన ఎన్నికల ప్రచారం సమయంలో పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే తమకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని అన్నారు. జిల్లా మంత్రి హరీష్‌రావు కనుసన్నలలో ఆయన ఆదేశాల ప్రకారమే పోలీసులు ఇదంతా చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పుకొంటున్న మంత్రి హరీష్‌రావు, తనను చూసి భయపడి ఇదంతా చేయిస్తున్నారా? ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించారా?అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇకనైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే వారిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తానని రఘునందన్ రావు హెచ్చరించారు.



Related Post