ధరణి పోర్టల్‌ నిర్వహణకు సిద్దంకండి: సోమేష్ కుమార్‌

October 17, 2020


img

తెలంగాణ ప్రభుత్వం ఈనెల 25న (విజయదశమి) ధరణి పోర్టల్‌ను ప్రారంభించనుంది. దీనికి సంబందించిన అంశాలపై  జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లతో చర్చించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇక నుంచి రాష్ట్రంలో 570 మండలాలలో తహసీల్దారులు జాయింట్ సబ్-రిజిస్ట్రార్లుగా పనిచేస్తారు. ప్రస్తుతం సబ్-రిజిస్ట్రార్లుగా చేస్తున్న 142 మంది వ్యవసాయేతర ఆస్తులను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. దేశంలో సంచలనం సృష్టించబోతున్న ధరణి పోర్టల్‌ను అన్ని విధాలా అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నాము. దానిని అదే స్థాయిలో సమర్ధంగా, నిరంతరాయంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. జిల్లా స్థాయి అధికారులు డిస్కమ్‌ల అధికారులతో, బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లతో, టిఎస్‌టిఎస్ ప్రతినిధులతో మాట్లాడుకొని అందరినీ సమన్వయపరుచుకొంటూ ధరణి పోర్టల్‌ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ధరణి పోర్టల్‌ గురించి అవగాహన చేసుకొనేందుకుగాను తహసీల్దారులు ఒక్కొక్కరూ రేపటిలోగా 10 లావాదేవీలను పూర్తి చేయాలి. ప్రయోగాత్మకంగా చేసే ఈ లావాదేవీలలో ఏవైనా సమస్యలు లేదా లోపాలు ఎదురైనట్లయితే ఇప్పుడే వాటిని సరిదిద్దుకొనే అవకాశం ఉంటుంది,” అని సూచించారు.

ధరణి పోర్టల్‌లో ప్రజలు ఆస్తుల నమోదు కార్యక్రమం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. అత్యంత ఖచ్చితమైన వివరాలతో ధరణి పోర్టల్‌ను రూపొందిస్తున్నామని ప్రభుత్వం చెపుతుంటే, ఈ నమోదు కార్యక్రమంలో వాలంటీర్లుగా పనిచేస్తున్నవారిలో చాలామందికి దాని గురించి సరైన అవగాహన లేకపోవడంతో అరకొర సమాచారం నమోదు చేస్తున్నట్లు పిర్యాదులు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో వాలంటీర్లు కాలనీలో నామమాత్రంగా కొన్ని ఇళ్ళ వివరాలు నమోదు చేసి మరికొన్నిటిని వదిలేస్తున్నట్లు ప్రజల నుంచి పిర్యాదులు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో ఆన్‌లైన్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేయలేకపోతున్నట్లు సమాచారం. కనుక ధరణి పోర్టల్‌లో నమోదవుతున్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే దాని గురించి మాట్లాడితే బాగుంటుందేమో?


Related Post