ఆలయాలకు...భక్తులకు మార్గదర్శకాలు

June 05, 2020


img

ఈ నెల 8వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు తెరుచుకోనున్నాయి. ఈ సందర్భంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశాయి. తెలంగాణలో ఆలయాలు, ప్రార్ధనా మందిరాలను తెల్లవారుజామున 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచవచ్చని, రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

 ఆలయాలు, ప్రార్ధనా మందిరాలకు... 

ప్రవేశద్వారాల వద్ద తప్పనిసరిగా భక్తులందరికీ శానిటైజర్లు ఇచ్చి, ధర్మల్ స్కానింగ్ చేసి కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ చేసుకొన్నాకనే లోపలకు అనుమతించాలి. ఆలయాలు, ప్రార్ధనా మందిరాలలో ప్రవేశానికి మాస్కూలు ధరించడం తప్పనిసరి లేకుంటే లోపలకు అనుమతించరాదు. తీర్ధప్రసాదాలను పంచిపెట్టకూడదు. పవిత్ర జలాలను భక్తులపై చల్లరాదు. లోపలా, బయటా కూడా భక్తులు భౌతికదూరం పాటించేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. అన్నదాన కార్యక్రమాలలో కూడా భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి.      

భక్తులకు మార్గదర్శకాలు: 

భక్తులు తమ చెప్పులను తమ వాహనాలలో విడిచిపెట్టి రావాలి. వీలైనంతవరకు హ్యాండ్ బ్యాగులు, మొబైల్ ఫోన్లు వగైరా లేకుండా వస్తే మంచిది. ఆలయాలు, ప్రార్ధనా మందిరాలలోకి ప్రవేశిస్తున్నప్పుడు భక్తులు, బయటే కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మాస్కూలు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి. 

కరోనా నేపద్యంలో పదేళ్ళలోపు పిల్లలు, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఆలయాలు, ప్రార్ధనా మందిరాలకు రాకపోవడమే మంచిది.

దర్శనాలు, పూజలు పూర్తవగానే పరిసర ప్రాంతాలలో తిరుగుతూ కాలక్షేపం చేయకుండా ఇళ్లకు తిరిగి వెళ్లిపోవడం మంచిది.


Related Post