తెలంగాణలో 49/453 కరోనా కేసులు

April 09, 2020


img

తెలంగాణలో బుదవారం కొత్తగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 453కి పెరిగింది. ఇప్పటివరకు 45 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలినవారు ఆసుపత్రులలో ఇంకా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మంది కరోనాతో మృతి చెందారు.

ప్రపంచదేశాలలో కరోనా వైరస్ పాకిన తరువాత విదేశాల నుంచి సుమారు 25,000మందికి పైగా రాష్ట్రానికి వచ్చారు. వారిలో కరోనా సోకినవారిని వెంటనే గుర్తించి చికిత్స అందిస్తుండటంతో అందరూ కొలుకొంటున్నారు. మిగిలినవారందరినీ  క్వారంటైన్‌లో ఉంచడం వలన రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉంది. క్వారంటైన్‌ ముగిసిన వారందరినీ మరో రెండు రోజులలో ఇళ్లకు పంపించివేస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు.  

ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చేవారు ఎవరూ లేరు కనుక డిల్లీ మర్కజ్ కేసులకు సంబందించి 535 మంది కరోనా రిపోర్టులు గురువారం సాయంత్వానికి వస్తే రాష్ట్రంలో కరోనా కేసుల కధ ఓ కొలిక్కి రావచ్చునని మంత్రి ఈటల రాజేందర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. డిల్లీ మర్కజ్ కేసులపై స్పష్టత వస్తే ఇక రాష్ట్రంలో ప్రభుత్వ క్వారంటైన్‌ శిబిరాలు అవసరం ఉండకపోవచ్చునని, కరోనా లక్షణాలున్నవారిని హోమ్ క్వారంటైన్‌లోనే ఉంచి పరిశీలిస్తుంటామని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉందని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను 1,500 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దామని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఇకపై రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులన్నీ సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో మాత్రమే చికిత్స చేస్తామని చెప్పారు. 


Related Post