పరమశివుడికి రైల్లో బెర్త్!

February 18, 2020


img

పాలకులను మెప్పించేందుకు కొందరు అధికారులు చేసే చిత్రవిచిత్రమైన పనులతో ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంటుంది. ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కాశీ-మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం వారణాసి(కాశీ)లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. రైల్వేశాఖకు అనుబందంగా పనిచేస్తున్న ఐఆర్‌సీటీసి అధ్వర్యంలో నడిపించబడుతున్న ప్రైవేట్ రైళ్ళలో ఇది 3వది. మరో విశేషమేమిటంటే..ఆ రైల్లో బీ-5 ఏసీ బోగీలో 64వ నెంబర్ బెర్తును పరమశివుడికి కేటాయించారు! 



ఆ బెర్తును రంగురంగు కాగితాలతో అందంగా అలంకరించి దానిలో శివుడి ఫోటో పెట్టారు. ఆ రైలు మూడు జ్యోతిర్లింగ క్షేత్రాలైన ఓంకారేశ్వర్ (ఇండోర్,మద్య ప్రదేశ్), మహాకాళేశ్వర్ (ఉజ్జయిని, మద్య ప్రదేశ్), కాశీ విశ్వనాథ్ (కాశీ, ఉత్తరప్రదేశ్)ల మద్య ప్రయాణిస్తుంటుంది కనుక దానిలో 64వ నెంబరు బెర్తును శాస్వితంగా పరమశివుడికి కేటాయించాలని భావిస్తున్నట్లు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ చెప్పారు. 

కాస్త వెరైటీగా ఉంటుందని చేసిన ఈ ప్రయోగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు వెంటనే మాట మార్చేరు. మూడు జ్యోతిర్లింగ క్షేత్రాలను కలుపుతూ వేసిన రైలు ప్రారంభోత్సవం రోజున రైల్వే సిబ్బంది బెర్తుపై శివుడి ఫోటోను ఉంచి పూజలు చేసి దానిని అలాగే ఉంచేశారని, అందుకే మీడియా అపోహ పడిందని అధికారులు సర్దిచెప్పారు. 20వ తేదీ నుంచి కాశీ-మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ సేవలు మొదలైనప్పుడు, ఆ బెర్తును కూడా ప్రయాణికులకు కేటాయిస్తామని ఐఆర్‌సీటీసి అధికారులు తెలిపారు. 


Related Post