గాంధీ ఆసుపత్రి వైద్యుడు డా.వసంత్ ఆత్మహత్యాయత్నం భగ్నం

February 11, 2020


img

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని పుకార్లు పుట్టిస్తున్నారనే ఆరోపణలతో డా.వసంత్‌ మరో ఇద్దరు ఉద్యోగులను ఆసుపత్రి సూపరిండెంట్ సస్పెండ్ చేశారు. దాంతో తీవ్రమనోవేదన చెందిన డా.వసంత్‌ ఈరోజు ఉదయం చొక్కాలో పెట్రోల్ బాటిల్స్ పెట్టుకొని ఆసుపత్రికి వచ్చి, ఆవరణలో నిలబడి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించారు. ఆసుపత్రి సూపరిండెంట్ తక్షణం వచ్చి తన వద్దకు వచ్చి తనను సస్పెండ్ చేసినందుకు క్షమాపణ చెప్పి సస్పెన్షన్ లెటరును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఈ సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆయనకు నచ్చజెప్పేందుకు చాలాసేపు ప్రయత్నించారు. కానీ ఆయన చేతిలో లైటర్ పెట్టుకొని ‘ఎవరైనా దగ్గరకు వస్తే నిప్పంటించుకొంటానని’ బెదిరించడంతో పోలీసులు దూరంగా నిలబడి ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆలోగా ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక సిబ్బందిని కూడా పిలిపించి, నీళ్ళ క్యానులను సిద్దం చేసుకొన్నాక పోలీసులు హటాత్తుగా ఆయన మీదపడి, చేతిలో నుంచి లైటర్ గుంజుకొని బట్టల్లో దాచుకొన్న పెట్రోల్ బాటిల్స్‌ను తీసేశారు. ఆ తరువాత ఆయనను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఈ సందర్భంగా డా.వసంత్ పోలీసులు, మీడియాతో మాట్లాడుతూ, “ఈఎస్ఐ స్కామ్ కంటే చాలా పెద్ద స్కామ్ గాంధీ ఆసుపత్రిలో జరుగుతోంది. ఆసుపత్రిలో జరుగుతున్న ఈ అవినీతి, అక్రమాల గురించి ప్రశ్నించినందుకే ఆసుపత్రి సూపరిండెంట్, డీఎంఓ నాపై కక్ష కట్టి ఈ వంకతో నన్ను సస్పెండ్ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని పుకార్లు పుట్టించి ఆసుపత్రి ప్రతిష్టకు నేనెందుకు భంగం కలిగిస్తాను? నాపై అన్యాయంగా ఈ నిందను మోపి నన్ను అవమానించారు. ఇన్నేళ్ళుగా సేవలు చేసినందుకు చివరికి ఇదా బహుమానం?” అని డా.వసంత్‌ ప్రశ్నించారు. 

కరోనా వైరస్‌ పుకార్ల సంగతి పక్కనపెట్టి, గాంధీ ఆసుపత్రిలో ఈఎస్ఐ స్కామ్ కంటే చాలా పెద్ద స్కామ్ జరుగుతోందని డా.వసంత్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తెలిస్తే మంచిది.


Related Post