మజ్లీస్ ర్యాలీపై బిజెపి అభ్యంతరం

January 24, 2020


img

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా మజ్లీస్ పార్టీ శనివారం హైదరాబాద్‌ చార్మినార్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనుంది. దానిపై రాష్ట్ర బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మరికొందరు బిజెపి నేతలు గురువారం హైదరాబాద్‌ పోలీస్ కమీషనర్ అంజని కుమార్‌ను కలిసి మజ్లీస్ ర్యాలీకి అనుమతించవద్దని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. మజ్లీస్ పార్టీ సీఏఏ అంశాన్ని అడ్డుపెట్టుకొని జాతీయ జెండాలు చేతబట్టుకొని ర్యాలీలు, ఆందోళనలు చేయడానికి అనుమతించినట్లయితే నగరంలో శాంతిభద్రతలకు భంగం కలుగవచ్చునని వారు ఫిర్యాదు చేశారు. పార్లమెంటు ఆమోదించిన సీఏఏ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి బిజెపి సభలు, సమావేశాలు నిర్వహించాలనుకొంటే బిజెపి నేతలను గృహనిర్బందం చేసే పోలీసులు, సీఏఏకు వ్యతిరేకంగా మజ్లీస్ పార్టీ ర్యాలీలకు అనుమతులు ఇవ్వడమే కాక వారికి పోలీసులు భద్రత కూడా కల్పిస్తున్నారని ఆరోపించారు. మజ్లీస్ ర్యాలీలో పాల్గొనే నేతలు ప్రజలలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా ప్రసంగిస్తుంటారని తెలిసీ వారికి ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.


Related Post