ఓయూ ప్రొఫెసర్ ఖాసిం అరెస్ట్

January 18, 2020


img

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీంను శనివారం పోలీసులు అరెస్ట్ చేయడంతో యూనివర్సిటీలో కలకలం మొదలైంది. ఏసీపీ నారాయణ నేతృత్వంలో శనివారం ఉదయం గజ్వేల్ పోలీసులు హైదరాబాద్‌ వచ్చి ఆయన ఇంట్లో తనికీలు చేపట్టారు. ఆయన ఇంట్లో విప్లవసాహిత్యం, మావోయిస్టులకు సంబందించిన కొన్ని కరపత్రాలు, కీలక డాక్యుమెంట్లు లభించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆయన కంప్యూటరులో హార్డ్ డిస్క్, పెన్‌డ్రైవ్‌ను కూడా స్వాధీనం చేసుకొన్నారు. తరువాత వారు ఆయనను అరెస్ట్ చేసి గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గతంలో అంటే 2016లో ఆయన కారులో విప్లవాసాహిత్యం, కొన్ని కరపత్రాలు లభించినప్పుడు ములుగు పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఓ కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే ఏ-2 నిందితుడుగా ఉన్న ప్రొఫెసర్ ఖాసీం ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశామని ఏసీపీ నారాయణ తెలిపారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో విప్లవసాహిత్యం, మావోయిస్టులకు సంబందించిన కొన్ని కరపత్రాలు లభించినట్లు తెలిపారు. ప్రొఫెసర్ ఖాసీం ఇటీవలే విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 

ప్రొఫెసర్ ఖాసీం ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్న సంగతి తెలుసుకొన్న ఉస్మానియా విద్యార్దులు అక్కడకు చేరుకొని ధర్నా చేశారు. ప్రొఫెసర్ ఖాసీంను అరెస్ట్ చేయడాన్ని వారు ఖండించారు. ఆయనను బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ పోలీసులు ఆయనను ఇవాళ్ళ కోర్టులో హాజరుపరిచిన తరువాత, కోర్టు అనుమతితో ఆయనను ప్రశ్నించేందుకు మళ్ళీ అదుపులో తీసుకోవచ్చు.


Related Post