ఏపీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం: కొత్త ట్విస్ట్

December 12, 2019


img

ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్టీసీలో కేంద్రప్రభుత్వానికి 33 శాతం వాటా కలిగి ఉండటం, 1997లో అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 14/97ను అవరోధంగా నిలుస్తుండటంతో ఏపీఎస్ ఆర్టీసీని నేరుగా రద్దు చేయడం కానీ ప్రభుత్వంలో విలీనం చేయడం గానీ సాధ్యం కాదని అధికారులు తెలుపడంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించి చివరికి ఒక మార్గం కనుగొంది.

రోడ్లు, భవనాల శాఖలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసి, దానిలోకి ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న 52,000 మంది కార్మికులను తీసుకోవాలని నిర్ణయించింది. తద్వారా ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామనే హామీని నిలబెట్టుకోగలుగుతుంది. ఆర్టీసీని రద్దు, విలీనం చేయడంలేదు కనుక ఎటువంటి న్యాయసమస్యలు ఎదురవవని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ప్రతిపాదనకు నిన్న జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. కనుక శాసనసభలో ఇందుకు సంబందించి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించగానే ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వోద్యోగులుగా మారనున్నారు. 


Related Post