కర్ణాటకలో మళ్ళీ కమల వికాసం

December 09, 2019


img

కర్ణాటకలో మళ్ళీ కమలం వికసించింది. కాంగ్రెస్‌-జెడిఎస్‌ పార్టీలకు చెందిన 15 మంది రాజీనామాలు చేయడంతో ఆ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో బిజెపి 12, కాంగ్రెస్‌ 2 స్థానాలు గెలుచుకొన్నాయి. ఒకటి ఇతరులు గెలుచుకొన్నారు. దీంతో కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వానికి శాసనసభలో పూర్తి మెజారిటీ ఏర్పడింది. ఉపఎన్నికలలో ప్రజలు ఫిరాయింపుదారులకే ఓట్లు వేసి గెలిపించడం బాధ కలిగించినా తమ పార్టీ ప్రజల తీర్పును మన్నించి ఓటమిని అంగీకరిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ డికె శివకుమార్ అన్నారు.

గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి-105, కాంగ్రెస్‌-78,జెడిఎస్‌-37, ఇతరులు-5 స్థానాలు గెలుచుకొన్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 మంది ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ, కాంగ్రెస్‌-జెడిఎస్‌ ఎమ్మెల్యేలను నాయన్నో భయాన్నో లొంగదీసుకోగలమనే ధైర్యంతో గవర్నర్‌ అండదండలతో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శాసనసభలో బలనిరూపణ చేసుకోలేక మరుసటిరోజే రాజీనామా చేశారు. దాంతో కాంగ్రెస్‌-జెడిఎస్‌లు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ కాంగ్రెస్‌-జెడిఎస్‌లకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించి వారి చేత రాజీనామాలు చేయించడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి ఎడియూరప్ప మళ్ళీ అధికారం చేజిక్కించుకొన్నారు. ఆ 15 స్థానాలకే ఎన్నికలు జరుగగా ఆనాడు రాజీనామాలు చేసినవారిలో 12 మందిని బిజెపిలో చేర్చుకొని టికెట్లు ఇచ్చి పోటీ చేయించగా అందరూ విజయం సాధించారు. దాంతో శాసనసభలో బిజెపికి సొంతంగానే 118 మంది ఎమ్మెల్యేలతో పూర్తి మెజారిటీ లభించింది. ఇక మళ్ళీ ఎన్నికల వరకు కర్ణాటకలో రాజకీయ అనిశ్చిత ఉండదు. ప్రభుత్వం స్థిరంగా సాగే అవకాశం ఉంది. 


Related Post