రాష్ట్రంలో మహిళల భద్రతకు కార్యాచరణ సిద్దం

December 05, 2019


img

దిశ ఘటన నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల భద్రతకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసింది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ అధ్యక్షతన బుదవారం ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. దానిలో మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డిజిపి మహేందర్ రెడ్డి, అదనపు డీజీలు, ఐజీలు, పోలీస్ కమీషనర్లు పాల్గొన్నారు.   

రాష్ట్రంలో మళ్ళీ దిశ వంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు వారు ఒక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. ఆ వివరాలు: 

1. ఇకపై ఎక్కడ ఎటువంటి నేరం జరిగినా ప్రజలు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అది ఆ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి రానప్పటికీ పోలీసులు వెంటనే ‘జీరో ఎఫ్.ఐ.ఆర్’ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. 

2. షీ టీమ్స్ ను మరింత పటిష్టపరచాలి. ఇకపై షీ టీమ్స్ తరచూ పాఠశాలలు, కాలేజీలకు వెళుతూ విద్యార్ధినుల ఆత్మరక్షణకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. తద్వారా షీ టీమ్స్ విద్యార్ధినులకు దగ్గరవడమే కాకుండా వారి మద్య అవగాహన ఏర్పడుతుంది. 

3. మహిళలు, వృద్దులు, చిన్న పిల్లల భద్రత కోసం తెలంగాణ పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన ‘హాక్ ఐ’ మొబైల్ యాప్‌ను అందరూ సులువుగా వినియోగించుకొనేందుకు వీలుగా మరింత సరళీకరించాలి. దాని వినియోగం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. 

4. అత్యవసర సమయంలో పోలీసుల సహాయం పొందేందుకు ఏర్పాటు చేసిన 100, 112, 181, 1098 ఫోన్‌ నెంబర్ల గురించి ప్రజలందరికీ తెలిసేలా బహిరంగ ప్రదేశాలలో, విద్యాసంస్థల వద్ద పోస్టర్లను, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలపై స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి. 

5. గ్రామ స్థాయిలో నేరస్తులను గుర్తించి నేరాలను అరికట్టేందుకు పంచాయతీ కార్యదర్శులకు బాధ్యత అప్పగించాలి. వారు గ్రామంలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులను గుర్తించి వారికి, వారి తల్లితండ్రులు లేదా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. అటువంటి వారి గురించి ఎప్పటికప్పుడు పై అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలి. 

6. బాలలలో నైతిక విలువలను పెంపొందించే విధంగా పాఠ్యాంశాలు రూపొందించి అన్ని పాఠశాలలో వాటిని విధిగా భోదించాలి. వాటిలో ప్రతిభ చూపిన విద్యార్దులకు ప్రోత్సాహక పత్రాలు ఇవ్వాలి. 

7. అత్యవసర సమయాలలో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఏవిధంగా వ్యవహరించాలో తెలియజేస్తూ లఘు చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, నాటికలను సినిమా హాళ్ళు, టీవీ ఛానల్స్ లో ప్రదర్శించాలి. అలాగే బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఈ-లెర్నింగ్ ద్వారా కూడా ప్రజలను చైతన్య పరచాలి. 

ఈ నిర్ణయాలన్నిటినీ వీలైనంత త్వరగా ఆచరణలో పెట్టాలని హోంమంత్రి మహమూద్ ఆలీ, మంత్రులు అధికారులను ఆదేశించారు. 


Related Post