ప్రియాంకా రెడ్డి హత్యాచారంపై పార్లమెంటు ఆగ్రహం

December 02, 2019


img

ప్రియాంకా రెడ్డి హత్యాచారంపై ప్రస్తుతం పార్లమెంటులో వాడివేడిగా చర్చ సాగుతోంది. ఈ సంఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై పాల్గొంటున్న సభ్యులు అందరూ ఇటువంటి నేరాలపై వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేసి, జాప్యం చేయకుండా నేరస్తులకు కటినమైన శిక్షలు విధించేవిధంగా ప్రస్తుత చట్టాలను సవరించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి నేరాలు జరిగినా పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సత్వరమే దోషులను శిక్షించినప్పుడే ఇటువంటి నేరాలు చేసేవారిలో భయం ఏర్పడుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. 

ఈ అంశంపై పార్లమెంటులో తీవ్రంగా చర్చ జరుగుతున్న సమయంలోనే శనివారం రాజస్థాన్ రాష్ట్రంలో ఖేతడి అనే గ్రామానికి చెందిన ఆరేళ్ళ చిన్నారిని కొందరు దుండగులు స్కూలు నుంచి అపహరించుకొని పోయి సామూహిక అత్యాచారం చేసి, ఆ తరువాత ఆమె స్కూలు బెల్టుతోనే గొంతుకు ఉరివేసి హత్య చేసి పొదల్లో విసిరేసి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై కూడా ప్రస్తుతం పార్లమెంటులో వాడివేడిగా చర్చ జరుగుతోంది. 

ఎంపీ జయాబచ్చన్ మాట్లాడుతూ ఇటువంటి నేరాలకు పాల్పడినవారిని బహిరంగంగా ఉరి తీసినప్పుడే నేరస్తులకు భయం పుడుతుందని అన్నారు. అన్నాడిఎంకె ఎంపీ విజిల సత్యనాధ్ మాట్లాడుతూ ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి డిసెంబర్ నెలాఖరులోగా ప్రియాంకా రెడ్డి దోషులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. 

నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సాహసోపేతమైన, సంచలన నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తున్నందున, ఇటువంటి నేరస్తులను కటినంగా శిక్షించేందుకు ఈ సమావేశాలలోనే బిల్లును ప్రవేశపెట్టినా ఆశ్చర్యంలేదు. పార్లమెంటు సభ్యులు కూడా హత్యాచారాలకు ఉరి శిక్షవేయాలని ఇప్పుడు ముక్తకంఠంతో కోరుతున్నందున ఒకవేళ అటువంటి బిల్లు ప్రవేశపెడితే వెంటనే ఆమోదముద్ర పడే అవకాశాలు కూడా ఉన్నాయి. 



Related Post