మున్సిపల్ ఎన్నికలకు మళ్ళీ బ్రేక్

November 21, 2019


img

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు మళ్ళీ బ్రేక్ పడింది. మున్సిపల్ ఎన్నికలపై అభ్యంతరాలు తెలుపుతూ దాఖలైన అన్ని పిటిషన్లను కొన్ని రోజుల క్రితం హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కానీ వాటిలో 78 మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణపై విధించిన స్టేను రద్దు చేయడానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి నిరాకరించారు. 

ఈ కేసుపై బుదవారం జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మున్సిపల్ ఎన్నికలపై అభ్యంతరాలు తెలుపుతూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసిందని కనుక 78 మున్సిపాలిటీలలో స్టే ఎత్తివేసినట్లయితే రాష్ట్రంలోని మొత్తం 123 మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం, ఎన్నికల సంఘం సిద్దంగా ఉన్నాయని అభ్యర్ధించారు. 

అయితే హైకోర్టు ధర్మాసనం కేవలం వార్డుల విభజనకు సంబందించిన జీవో 459పై మాత్రమే విచారణ జరిపి తీర్పు చెప్పింది తప్ప వార్డులలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపలేదని, కానీ హైకోర్టు ధర్మాసనం మొత్తం అన్ని అంశాలపై విచారణ జరిపిందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, మయూరిరెడ్డి, నరేష్ రెడ్డి వాదించారు. తాము పేర్కొన్న 78 మున్సిపాలిటీలలోని వార్డుల పునర్విభజనలో అనేక అవకతవకలు జరిగాయని, వాటిని సవరించకుండానే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలనుకొంటోందని వాదించారు. వాటిలో ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో రకమైన అవకతవకలు, లోపాలు జరిగాయని, వాటన్నిటికీ కలిపి ప్రభుత్వం ఒకే అఫిడవిట్‌ సమర్పించడాన్ని కూడా వారు తప్పుపట్టారు. 78 మున్సిపాలిటీలపై వేర్వేరుగా విచారణ చేపట్టాలనే పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు వాటిపై విధించిన స్టేను తొలగించడానికి నిరాకరించింది. పిటిషనర్ కోరినట్లుగానే 78 మున్సిపాలిటీలపై వేర్వేరుగా విచారణ చేపట్టారు. కనుక మున్సిపల్ ఎన్నికల కధ మళ్ళీ మొదటికొచ్చినట్లయింది.


Related Post