నేడు బస్‌ రోకో...అనుమతి లేదు: పోలీస్

November 16, 2019


img

ఆర్టీసీ సమ్మె నేటితో 43వ రోజుకు చేరుకొంది. సమ్మెలో భాగంగా ‘బస్‌ రోకో’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆర్టీసీ బస్సులు తిరగకుండా అడ్డుకోవాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునివ్వడంతో ఆర్టీసీ కార్మికులు డిపోలవద్దకు చేరుకొన్నారు. బస్‌ రోకో కార్యక్ర మానికి పోలీస్ అనుమతి లేదని, ఆర్టీసీ కార్మికులు గుంపులుగా వచ్చి బస్సులను అడ్డుకొనే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హైదరాబాద్‌ నగర కమీషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. నగరంలో బస్‌భవన్‌తో సహా అన్ని డిపోల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించబడింది. శనివారం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు డిపోల వద్ద కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. బస్సులను అడ్డుకొంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని కనుక ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేయవద్దని అంజని కుమార్ ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హైదరాబాద్‌ నగర కమీషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు.  

సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలు ఆర్టీసీ యూనియన్ ఆఫీసులో శనివారం నిరాహార దీక్ష చేయాలని నిశ్చయించుకొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిలను అరెస్ట్ చేసేందుకు వారి నివాసాలకు చేరుకొన్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేయబోతున్నారని తెలుసుకొని నగరంలోని ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో వారి నివాసాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈరోజు జరుగబోయే బస్‌ రోకో కార్యక్రమంతో మళ్ళీ ఆర్టీసీ కార్మికులకు, పోలీసులకు మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.


Related Post