ఏపీ సీఎస్‌గా నీలం సహానీ బాధ్యతలు స్వీకరణ

November 14, 2019


img

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నీలం సహానీ గురువారం అమరావతిలో బాధ్యతలు స్వీకరించారు. 1984 ఐఏస్‌ బ్యాచ్‌, ఏపీ కేడర్‌కు చెందిన ఆమె గతంలో కృష్ణా జిల్లా సబ్ కలెక్టరుగా పనిచేశారు. ఆ తరువాత పదోన్నతితో కేంద్రసర్వీసులకు వెళ్ళిన ఆమె సామాజిక న్యాయం, సాధికార శాఖలో కార్యదర్శిగా చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అభ్యర్ధన మేరకు ఆమెను కేంద్రప్రభుత్వం ఏపీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈరోజు ఆమె బాధ్యతలు చేపట్టారు.

మళ్ళీ చాలా కాలం తరువాత ఏపీకి తిరిగివచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, జగన్మోహన్ రెడ్డి వంటి ఒక డైనమిక్ ముఖ్యమంత్రి క్రింద పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఆమె అన్నారు. వచ్చే ఏడాది జూన్ వరకు ఆమె ఈ పదవీ విరమణ చేయనున్నారు. 

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా వ్యవహరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం తీరు సిఎం జగన్‌కు నచ్చకపోవడంతో ఆయనను ఆ పదవిలో నుంచి తప్పించి ఏపీ మానవవనరుల అభివృద్ధి శాఖకు డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో నీలం సహానీని నియమించుకొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా చేయడం కత్తి మీద సామూవంటిదేనని చెప్పవచ్చు. మరి నీలం సహానీ ఏవిధంగా నెగ్గుకొస్తారో చూడాలి. 


Related Post