టీఎస్‌ఆర్టీసీలో మరో బలిదానం

October 14, 2019


img

ఖమ్మం డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతితో టీఎస్‌ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఆదివారం తమ సమ్మెను మరింత ఉదృతం చేశారు. నిన్న మరో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నం చేయగా వారిలో ఒకరిని ఆర్టీసీ కార్మికులు కాపాడగలిగారు కానీ హైదరాబాద్‌లో రాణీగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ కండెక్టర్‌ సురేందర్ గౌడ్ నిన్న రాత్రి తన నివాసంలో ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయారు. దీంతో 24 గంటల వ్యవధిలో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకొన్నట్లయింది. 

ఆర్టీసీ కార్మికుల బలిదానాలపై కూడా ప్రభుత్వం-ప్రతిపక్షాలు, ఆర్టీసీ కార్మికులు పరస్పరం ఆరోపణలు చేసుకొంటున్నారు. వారిని ఆత్మహత్యలకు పురికొల్పినవారే బాధ్యత వహించాలని మంత్రులు వాదిస్తుంటే, వారి ఆత్మహత్యలు ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని ప్రతిపక్షాలు, ఆర్టీసీ కార్మికులు వాదిస్తున్నారు. సమ్మె చేస్తున్న 48,800 మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని, వారి స్థానంలో కొత్తవారిని నియమించుకొంటామని, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామంటూ సిఎం కేసీఆర్‌, మంత్రులు చేస్తున్న ప్రకటనల కారణంగానే ఆర్టీసీ కార్మికులు తీవ్రనిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ప్రతిపక్షాలు, ఆర్టీసీ కార్మికులు వాదిస్తున్నారు. 

కనుక ఇకనైనా సిఎం కేసీఆర్‌ తన మొండిపట్టు వీడి తక్షణం ఆర్టీసీ కార్మిక సంఘాలతో మళ్ళీ చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌ దిగివచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.   


నిన్న రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనలు, మానవహారాలు, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేశారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేసిన తరువాత మళ్ళీ తమ ఆందోళన కార్యక్రమాలు మొదలుపెడతారు. 


నల్గొండ, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్టీసీ అధికారులు, భద్రతాధికారులు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. వారికి ప్రభుత్వం జీతాలు చెల్లించేవరకు తాము తీసుకోమని ప్రకటించారు. నేటితో ఆర్టీసీ సమ్మె 10వ రోజుకు చేరింది. నానాటికీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 


నానాటికీ ఆర్టీసీ సమ్మె ఉదృతం అవుతుంటే, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థానంలో కొత్త వారిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునేందుకు ఆర్టీసీ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డ్రైవర్లకు రోజుకు రూ.1500, కండెక్టర్లకు రోజుకు రూ.1,000 చొప్పున జీతం ఇస్తామని ప్రకటించింది. ఈ చర్య ఆర్టీసీ కార్మికులను మరింత కవ్విస్తున్నట్లు ఉండటంతో సమ్మె మరింత తీవ్రరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.


Related Post