మేడారం జాతర తేదీలు ఖరారు

September 20, 2019


img

దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ది చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలను ఆలయ పూజారుల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఫిబ్రవరి 5న సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు వనదేవతలను మేడారంలోని గద్దెలకు ఊరేగింపుగా తీసుకురావడంతో మేడారం జాతర మొదలవుతుంది. మరుసటిరోజున అంటే ఫిబ్రవరి 6న సమ్మక్కను గద్దెకు తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. ఫిబ్రవరి 7నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకొంటారు. ఫిబ్రవరి 8వ తేదీన వనదేవతలు మళ్ళీ వనప్రవేశం చేస్తారు. 

ప్రతీ రెండేళ్ళకు ఒకసారి నాలుగు రోజులపాటు నిర్వహించే మేడారం జాతర ములుగు జిల్లాగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా గత ఏడాది జనవరి 31 నుంచి 3వ తేదీ వరకు జరిగింది. మళ్ళీ 2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరుగబోతోంది. 

ఈ జాతర ప్రధానంగా అడవులలో నివసించే గిరిజనులు చేసుకునేదే అయినా, సమ్మక్క సారలమ్మ వారిపై భక్తితో యావత్ తెలంగాణ ప్రజలు అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కాక పొరుగునే ఉన్న ఛత్తీస్ ఘడ్, మహరాష్ట్ర, ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కనుక టిఎస్ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వందలాది బస్సులను నడిపిస్తుంటుంది. గత ఏడాది మేడారం జాతరకు సుమారు కోటిమంది భక్తులు తరలివచ్చినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఏటికేడు ఈ సంఖ్య పెరుగుతూనే ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కోసం చాలా భారీగా ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర ఏర్పాట్ల కోసం రూ.80.55 కోట్లు ఖర్చు చేసింది.


Related Post