త్వరలో బతుకమ్మ చీరల పంపిణీ

September 20, 2019


img

ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో 1.02 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరాలను పంపిణీ చేయబోతోంది. రూ.300 కోట్లు వ్యయంతో 100 వెరైటీలతో అత్యంత ఆకర్షణీయంగా తయారుచేయించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో వాటిని గురువారం ప్రదర్శనకు ఉంచారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం తరపున ఆడపడచుల కానుకగా చీరలను అందించడంతో పాటు , రాష్ట్రంలోని చేనేత, మరమగ్గం కార్మికులకు జీవనోపాధి కల్పించాలనే ఉదాత్తమైన ఆశయంతో మూడేళ్ళ క్రితం ఈ కార్యక్రమం ప్రారంభించాము. అప్పటి నుంచి ఏటా చీరల సంఖ్య, నాణ్యతను పెంచుతున్నాము. వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ చీరలకు బ్రాండింగ్ కూడా చేయబోతున్నాము. ఈసారి 26,000 మరమగ్గల ద్వారా 10 రంగులు, 10 రకాల డిజైన్లలో మొత్తం 100 వెరైటీలలో చీరలు తయారుచేయించాము. 

వీటి ద్వారా రాష్ట్రంలో 16,000 కుటుంబాలకు ఏడాదిలో 8 నెలల పాటు ఉపాధి లభిస్తోంది. గతంలో మరమగ్గం కార్మికులకు నెలకు రూ.8-12,000 వరకు మాత్రమే ఆదాయం లభించేది. కానీ బతుకమ్మ చీరలు తయారుచేయించడం మొదలుపెట్టినప్పటి నుంచి నెలకు రూ.16-20,000 వరకు ఆదాయం లభిస్తోంది. గత మూడేళ్ళలో బతుకమ్మ చీరల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.715 కోట్లు ఖర్చు చేసింది. దీనివలన అటు నేత కార్మికులకు, ఇటు పేద మహిళలకు మేలు కలుగుతోంది. కనుక ఈ బతుకమ్మ చీరల తయారీ, పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తాము,” అని అన్నారు. 

రాష్ట్రంలో తెల్లారేషన్ కార్డు కలిగిన 18 ఏళ్ళు పైబడిన మహిళలందరికీ బతుకమ్మ చీరలు పొందడానికి అర్హులే. ఇప్పటికే జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చీరలు చేరుకున్నాయి. సోమవారం నుంచి రేషన్ షాపుల ద్వారా వీటి పంపిణీ మొదలుపెడతామని  చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శిలాజా రామయ్యర్ చెప్పారు. ఉత్తర తెలంగాణలో మహిళలు 9 గజాల పొడవుండే చీరాలను ధరిస్తారు కనుక వారికోసం ప్రత్యేకంగా 10 లక్షల చీరలు తయారుచేయించామని తెలిపారు. చీరలతో పాటు జాకెట్ ముక్కలను కూడా అందిస్తున్నామని చెప్పారు.


Related Post