కేసీఆర్‌-భట్టి శాసనసభలో వాగ్వాదం

September 14, 2019


img

ఈరోజు శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు, అప్పుల అంశాలపై సిఎం కేసీఆర్‌, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలకు మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. తొలుత సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “గత 5 ఏళ్ళలో రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలించింది. కానీ ఈసారి తెలంగాణతో సహా దేశమంతటా ఆర్ధిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చాలా వాస్తవిక దృక్పదంతో ఆలోచించి రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించాము. కనుక ఇక ముందు కూడా అభివృద్ధిపదంలో సాగిపోతుంది... అంటూ బడ్జెట్‌ గురించి క్లుప్తంగా వివరించారు. 

కేసీఆర్‌ ప్రసంగంపై స్పందించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ బడ్జెట్‌ వాస్తవికతకు చాలా దగ్గరగా పారదర్శకంగా ఉందని చెప్పుకొంటున్నారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఓట్ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌ కంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో సుమారు రూ.35,000 కోట్లు కోత విధించారు. అలాగే ఆదాయం, అప్పుల విషయంలో కూడా సిఎం కేసీఆర్‌ ప్రజలను పక్కదారి పట్టించేవిధంగా మాట్లాడారు. మిగులు బడ్జెట్‌తో చేతికి అందిన రాష్ట్రాన్ని కేవలం ఐదున్నరేళ్లలో రూ.3 లక్షల కోట్లు అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. మన ఆదాయానికి తగ్గట్లుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సాగించుకొని ఉండి ఉంటే, నేడు ఈ దుస్థితి ఎదురయ్యేది కాదు. కానీ తన ప్రాధాన్యతలే రాష్ట్ర ప్రాధాన్యతలుగా భావిస్తూ భారీగా అప్పులు చేసుకుంటూపోయారు. చివరికి అప్పులు కనబడుతున్నాయి కానీ ప్రాజెక్టులు మాత్రం కనబడటం లేదు,” అని అన్నారు. 

భట్టి విక్రమార్క విమర్శలపై సిఎం కేసీఆర్‌ కూడా ఘాటుగా స్పందించారు. “రాష్ట్రానికి మూడు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని మీరు నిరూపించగలరా? కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పటి వరకు 2.50 లక్షల మంది ప్రజలు చూసి వచ్చారు. వారందరికీ కనబడిన ప్రాజెక్టులు కాంగ్రెస్‌ నేతలకు కనబడకపోవడమే విచిత్రం. మీ నియోజకవర్గంలో కూడా ప్రాజెక్టు ఉంది. కనీసం అదైనా మీరు చూశారా? ప్రాజెక్టులు పూర్తయ్యి పంటలకు నీళ్లు అందుతున్నందుకు రాష్ట్రంలో రైతులు పండుగ చేసుకొంటుంటే, మీరు (కాంగ్రెస్‌ నేతలు) మాత్రం అక్కసుతో నోటికి వచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారు. ప్రజలు వరుసగా రెండుసార్లు బుద్ధి చెప్పినా మీలో మార్పు రాలేదు. మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, అబద్దాలు చెపుతూనే ఉన్నారు. మీరు మాట్లాడుతున్న మాటలను ప్రజలు కూడా వింటున్నారు. మళ్ళీ మీకు వారే తగిన విదమగ బుద్ధి చెపుతారు,” అని కేసీఆర్‌ అన్నారు. 

మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ, “రాష్ట్రానికి రూ.2 లక్షల 3,000 కోట్లు అప్పులు ఉన్నాయని మీరే మీ బడ్జెట్‌లోనే పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, మిషన్ భగీరధ వంటి సంస్థలు తీసుకున్న రూ.70,000 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చిందని మీరే చెపుతున్నారు. అవి మన రాష్ట్రంలో, మన ప్రభుత్వం అధీనంలో ఉన్న సంస్థలే కదా? వాటి బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలి కదా?త్వరలో మళ్ళీ అప్పులు తీసుకొంటామని చెపుతున్నారు. మరి అవన్నీ కలిపితే 3 లక్షల కోట్లు కంటే ఎక్కువే అవుతోంది కదా? మీరు శాసనసభకు సమర్పించిన లెక్కలను చూపించే నేను మిమ్మలని అడుగుతున్నాను తప్ప నా సొంత లెక్కలతో కాదు కదా? ఒకపక్క ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తూ మళ్ళీ అన్ని అద్భుతంగా ఉన్నాయని భుజాలు చరుచుకొంటున్నారు. అప్పులు నిజమా కాదా? దానిని భరించాల్సింది ప్రజలే కదా?” అని గట్టిగా నిలదీశారు. మళ్ళీ కెసిఆర్ కూడా ఆయనకు ధీటుగా జవాబు చెప్పారు. 


Related Post