కాళేశ్వరంలో నీళ్ళు ఎత్తిపోయడం లేదా?

September 14, 2019


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన బారీ మోటర్లను ఉపయోగించి నీటిని ఎత్తిపోస్తే విద్యుత్ వినియోగం బారీగా పెరిగిపోతుందనే భయంతో మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదనీటిని ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోయకుండా దిగువకు విడిచిపెడుతున్నారని ఆరోపించారు. దాంతో ఏ ఉద్దేశ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారో అది నెరవేరడంలేదని అన్నారు. నీటిని ఎత్తిపోసేందుకు పైనుంచి ఆదేశాలు రాకపోవడంతో దిగువకు విడిచిపెడుతున్నామని కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు చెప్పారని జీవన్ రెడ్డి ఆరోపించారు. కనుక తక్షణం మోటర్లను ఆన్‌ చేసి ఎగువకు నీటిని ఎత్తిపోయవలసిందిగా ప్రాజెక్టు అధికారులను ప్రభుత్వం ఆదేశించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

జీవన్ రెడ్డి చేస్తున్న ఈ సంచలన ఆరోపణపై తెరాస నేతలు, మంత్రులు ఇంకా స్పందించవలసి ఉంది. విద్యుత్ వినియోగం, దాని వలన వచ్చే విద్యుత్ బిల్లుకు భయపడి నీటిని ఎత్తిపోయకుండా దిగువకు నీటిని విడిచిపెడుతున్న మాట నిజమైతే కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. కనుక జీవన్ రెడ్డి ఆరోపణలపై ప్రభుత్వం తక్షణం స్పందించడం మంచిది. లేకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉంటుంది.


Related Post