బిజెపిలో చేరుతున్న చివరి టిడిపి నేతను నేనే: గరికపాటి

August 19, 2019


img

రాష్ట్ర బిజెపి అధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ‘నమో భారత్-నవ తెలంగాణ’ పేరిట జరిగిన బహిరంగసభలో తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్‌, టిడిపి నేతలు, కార్యకర్తలు బిజెపిలో చేరారు. వారిలో టిడిపి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రి జగన్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఊక అబ్బయ్య, బిజెపిలో చేరారు. వారితోపాటు సర్రోతం రెడ్డి, ఎర్ర శేఖర్, శ్రీనివాసరావు, మువ్వా సత్యనారాయణ, బండ్రు శోభారాణి, పి.రాజనీకుమారి, శ్రీకళారెడ్డి, పుల్లారావు, కోనేరు చిన్ని, బాల వినోద్, డాక్టర్ రవి, అంజయ్య యాదవ్, దీపక్ రెడ్డి,  తదితరులు బిజెపిలో చేరారు. వారందరికీ బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఎంపీ గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ, “తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం చివరివరకు పోరాడాను కానీ సాధ్యం కాలేదు. పార్టీని విడిచిపెట్టవలసి రావడం చాలా బాధ కలిగిస్తోంది కానీ రాష్ట్రంలో టిడిపి దాదాపు అదృశ్యమైపోయింది కనుకనే పార్టీని వీడవలసి వస్తోంది. రాష్ట్రంలో పార్టీని వీడుతున్న చిట్ట చివరి వ్యక్తిని నేనే. ఏపీలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్వైభవం సాధించాలని కోరుకొంటున్నాను. చంద్రబాబునాయుడు నాకు పార్టీలో సముచిత స్థానం, గౌరవం కల్పించి ఆదరించారు. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక నుంచి రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను. త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలోనే తెరాసకు మా సత్తాను చూపిస్తాము,” అని అన్నారు.


Related Post